అదానీ చేతికి జై ప్రకాశ్ అసోసియేట్స్‌.. డీల్ విలువ రూ.14,535 కోట్లు

అదానీ చేతికి  జై ప్రకాశ్ అసోసియేట్స్‌.. డీల్ విలువ రూ.14,535 కోట్లు

న్యూఢిల్లీ: అప్పుల్లో కూరుకుపోయిన జైప్రకాశ్ అసోసియేట్స్ (జేఏఎల్)ను స్వాధీనం చేసుకోవడానికి అదానీ గ్రూప్‌కి మెజారిటీ రుణదాతల మద్దతు లభించింది. రూ.14,535 కోట్ల విలువైన అదానీ ప్రతిపాదనలో రూ.6,005 కోట్లు ముందస్తు  చెల్లింపు ఉంది. దీంతో  ప్రత్యర్థుల కంటే అదానీ గ్రూప్ డీల్ ఆకర్షణీయంగా నిలిచింది. క్రెడిటర్ల కమిటీ (సీఓసీ)లో అదానీకి 89శాతం ఓట్లు లభించగా, దాల్మియా సిమెంట్, వేదాంత  ప్రతిపాదనలు తరువాతి స్థానాల్లో నిలిచాయి. జేఏఎల్‌ ఎవరికి అమ్మాలో నిర్ణయించడంలో నేషనల్ అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీ (ఎన్‌ఏఆర్‌‌సీఎల్‌)కి  ఎక్కువ అధికారం ఉంది .  

వేదాంత రూ.3,800 కోట్ల ముందస్తు, రూ.12,400 కోట్లు ఐదు సంవత్సరాల్లో చెల్లించే ప్రతిపాదన చేసింది. ఈ కంపెనీ మొత్తం రూ.16,726 కోట్లు చెల్లించేందుకు ముందుకొచ్చింది. జేఏఎల్‌, డెవలప్‌మెంట్ అథారిటీ  వైఈఐడీఏ  కేసు తీర్పుపై ఆధారపడి దాల్మియా  ప్లాన్ ఉంది.  జేఏఎల్‌కు  గ్రేటర్ నోయిడా, నోయిడా, జేవర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఎన్‌సీఆర్‌‌లో హోటళ్లు, ఎంపీ, యూపీల్లో సిమెంట్ ప్లాంట్లు, లైమ్‌స్టోన్ మైన్స్ ఉన్నాయి.

అదానీ గ్రూప్‌‌తో బొండాడ ఒప్పందం 

హైదరాబాద్ కంపెనీ  బొండాడ గ్రూప్,  అదానీ గ్రూప్ ఐదు సంవత్సరాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం సోలార్ ఎనర్జీ సెక్టార్‌‌‌‌లో  డిజైన్, నిర్మాణ పనులు కలిసి చేపడతాయి. తొలి ప్రాజెక్ట్‌‌గా బీఈఎల్‌‌ కోసం చేపట్టే 650 మెగావాట్ల (ఎండబ్ల్యూ) సోలార్‌‌‌‌ పనులు అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి ఈ కంపెనీకి షిప్ట్ అవుతాయి.