మోదీ, బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు : రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

మోదీ, బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు : రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు
  • యూట్యూబ్‌‌‌‌లో సర్క్యులేట్​ అయ్యే ఫేక్ న్యూస్‌‌‌‌ను తిప్పికొట్టాలి  రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు

హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియా ముసుగులో ప్రధాని నరేంద్ర మోదీపైగానీ, బీజేపీ నేతలపైగానీ తప్పుడు రాతలు రాస్తే ఎంతటి వారైనా సరే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బీజేపీ స్టేట్‌‌‌‌ చీఫ్‌‌‌‌ రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు హెచ్చరించారు. వ్యూస్ కోసం కక్కుర్తి పడి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న కొన్ని యూట్యూబ్ చానల్స్‌‌‌‌పై ఇప్పటికే లీగల్ సెల్ ద్వారా రూ.5 కోట్ల పరువు నష్టం దావాలు వేశామని గుర్తు చేశారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా బాధ్యతగా వ్యవహరిస్తున్నదని, యూట్యూబర్లు కూడా తమ విశ్వసనీయతను కాపాడుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం చేసే పనులను విశ్లేషించడంలో తప్పు లేదని, కానీ వ్యక్తిగత దాడులకు దిగితే చట్టపరంగా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 

బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్ లో లీగల్, ఐటీ, సోషల్ మీడియా సెల్స్ సంయుక్తంగా నిర్వహించిన సమావేశంలో రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటాన్ని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు.  పార్టీ స్టేట్ ప్రెసిడెంట్‌‌‌‌ను తిడితే అది అందరినీ తిట్టినట్లే అవుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ జనాల్లో నడుస్తున్నదని చెప్పారు. ఈ భయంతోనే ప్రత్యర్థి పార్టీలు సోషల్ మీడియాను అడ్డంపెట్టుకొని ఫేక్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ అప్రమత్తంగా ఉండాలని కోరారు.  ఇకపై 15 రోజులకోసారి ఈ 3 విభాగాలతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని తెలిపారు.  

మొత్తం పత్తి కొంటం

పత్తి కొనుగోలు విషయంలో రైతులను కాంగ్రెస్, బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తున్నాయని రాంచందర్‌‌‌‌‌‌‌‌రావు ఆరోపించారు. ఎంత ప్రొడక్షన్ ఉంటే అంత పత్తి పంటను కొంటామని కిషన్‌‌‌‌రెడ్డి చొరవతో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. రైతులు అధైర్య పడొద్దని, మద్దతు ధర ప్రకారమే కేంద్ర ప్రభుత్వం పత్తిని కొనుగోలు చేస్తుందన్నారు.