చేవెళ్ల, వెలుగు: బీజాపూర్ టు హైదరాబాద్ హైవే పనులను స్పీడప్ చేశామని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. బుధవారం చేవెళ్ల మండల పరిధిలో కొనసాగుతున్న పనులను స్థానిక నాయకులతో కలిసి పర్యవేక్షించారు. అనంతరం ఆర్డీవో చంద్రకళ, తహసీల్దార్ కృష్ణయ్యతో పాటు సంబంధిత అధికారులతో సమీక్షించారు.
సాధ్యమైనంత త్వరగా రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ హైవే పూర్తయితే చేవెళ్ల, వికారాబాద్, తాండూర్, పరిగి ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే చేవెళ్ల పట్టణంలోని శ్రీనివాస కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు గోనె ప్రతాప్ రెడ్డి, దేవర వెంకట్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షుడు పడాల ప్రభాకర్, సీనియర్ నేత మర్పల్లి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
