- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అక్రమాలతో గెలిచింది
- కర్నాటక నుంచి మనుషులను తెప్పించి దొంగ ఓట్లు వేయించిందని కామెంట్
హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపు కోసం కేసీఆర్ నుంచి బూత్‌స్థాయి కార్యకర్త వరకు అందరూ కుటుంబ సభ్యుల్లా పనిచేశారని, దురదృష్టవశాత్తు కాంగ్రెస్, బీజేపీ అక్రమాలకు పాల్పడడంతో ఓడిపోయామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓడిన చోటే గెలిచి చూపిద్దామని, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు, పార్టీ బలోపేతంపై బుధవారం తెలంగాణ భవన్లో ముఖ్య నేతలు, కార్యకర్తలతో కేటీఆర్, హరీశ్ రావు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత.. పార్టీ ఆయన
కుటుంబానికి అండగా నిలిచిందన్నారు. గోపీనాథ్ సతీమణి సునీత గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పనిచేశారని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కార్యకర్తలు చేసిన పనికి మించి తాము పనిచేస్తామని, కాలికి బలపం కట్టుకొని తిరుగుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కర్నాటక నుంచి మనుషులను తెచ్చి కాంగ్రెస్ దొంగ ఓట్లు వేయించిందని, షేక్‌పేట, ఎర్రగడ్డలో రిగ్గింగ్ చేశారని ఆరోపించారు. పోలీసులను అడ్డం పెట్టుకొని, డబ్బు, మద్యం పంచి గెలిచారని, ఇది నైతిక గెలుపు కాదని విమర్శించారు. వ్యక్తిగత విషాదంలో ఉన్నా హరీశ్‌రావు.. పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని కొనియాడారు. స్థానిక సంస్థల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలంతా పనిచేయాలని సూచించారు.
డిసెంబర్‌లోపు సర్పంచ్, జిల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉందని, ఆ వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని తెలిపారు. కేటీఆర్ మీటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కార్యకర్తలు పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం డివిజన్ అధ్యక్షునికి మాత్రమే ప్రాధాన్యం ఉంటే సరిపోదని, కార్యకర్తల మాటలు కూడా వినాలని కేటీఆర్, హరీశ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉద్యమకారులకు గుర్తింపు దక్కడం లేదన్నారు.
నైతిక విజయం బీఆర్‌ఎస్‌దే: హరీశ్‌రావు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలపై బీఆర్‌ఎస్ నాయకులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, పోరాట స్ఫూర్తితో పనిచేసిన కార్యకర్తలదే నైతిక విజయమని హరీశ్ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్మళ్లీ అధికారంలోకి వస్తారని, తమను ఇబ్బంది పెట్టిన ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 18 వేల ఓట్లే వచ్చిన జూబ్లీహిల్స్‌లో.. ఈ ఉప ఎన్నికలో 75 వేల ఓట్లు సాధించడం కార్యకర్తల కృషికి నిదర్శనమన్నారు.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ సాంకేతికంగా గెలిచినా.. నైతిక విజయం బీఆర్‌ఎస్ అభ్యర్థి సునీతదేనన్నారు. కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా అందరం కార్యకర్తలకు కుటుంబ సభ్యులుగా అండగా ఉంటామన్నారు. జీహెచ్ఎంసీ, ఇతర ఎన్నికల్లో కలిసి పనిచేసి మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేసుకుందామని పిలుపునిచ్చారు.
