ఫలక్​నుమాలో మంటలు.. ప్రమాదమా ఉగ్ర కోణమా

ఫలక్​నుమాలో మంటలు.. ప్రమాదమా ఉగ్ర కోణమా
  • షార్ట్​ సర్క్యూట్​ అని కొందరు సిగరెట్ ​వల్లే అంటున్న మరికొందరు..
  • గతేడాది ఇక్కడే దక్షిణ్​ఎక్స్​ప్రెస్​ పార్శిల్​ బోగీలో మంటలు
  • రెండు ఘటనలు జరిగింది ప్రధాని మోదీ పర్యటనకు ముందు రోజే ..
  • ఆ లెటర్​పైనా అనుమానాలు

యాదాద్రి, వెలుగు :  జూలై 7న ఫలక్​నుమా ఎక్స్ ప్రెస్​ రైలులో జరిగిన ప్రమాదంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఏదైనా ఉగ్రకోణం ఉందా..? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ​రైలుకు మంటలు అంటుకున్నాయన్న విషయం తెలియగానే.. ముందుగా షార్ట్​​సర్క్యూట్​వల్లే కావచ్చనే ప్రచారం జరిగింది. తర్వాత ఎవరో సిగరెట్​తాగి పడేయడం వల్లే మంటలు అంటుకున్నాయనే మరో వాదన  బయలుదేరింది. మీడియాలోనూ ఇదే తరహా కథనాలు వచ్చాయి. తర్వాత కొద్దిసేపటికే పది రోజుల క్రితం ఊరు, పేరు లేకుండా రైల్వే డీఆర్ఎంకు వచ్చిన ఓ లెటర్ ​సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఒడిశాలోని బాలాసోర్​లో జరిగిన ప్రమాదం లాంటిదే మరో ప్రమాదం జరుగుతుందని ఆ మెసేజ్​ సారాంశం. అందుకు తగ్గట్లే పశ్చిమ బంగా నుంచి వస్తున్న ఫలక్​నుమా ఎక్స్​ప్రెస్ ​రైలు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి వద్దకు రాగానే బోగీలకు మంటలు వ్యాపించాయి.

సిగరెట్ ​కారణంగా మంటలు ఈ స్థాయిలో వ్యాపించే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. మరి.. ముందుగా అనుకున్నట్టుగా షార్ట్ సర్య్యూట్​కారణమా? లేదంటే ఈ సంఘటనలో ఉగ్ర కోణం ఏమైనా ఉందా..? అనే చర్చ జరుగుతోంది. కాగా, ప్రమాద కారణాలపై రైల్వే ఆఫీసర్ల నుంచి ఇప్పటివరకు సరైన ప్రకటన రాకపోవడం కూడా ప్రజల్ని గందరగోళపరిచేలా ఉంది. పూర్తిస్థాయి ఎంక్వైరీ తర్వాతే ప్రమాదం ఎలా జరిగిందో చెప్పగలమని రైల్వే ఆఫీసర్లు అంటున్నారు. మంటల్లో కాలిపోయిన బోగీలు పగిడిపల్లికి చేరుకున్న తర్వాత ఫోరెన్సిక్​ఆఫీసర్లు పరిశీలించారు.

కొంచెం ఆలస్యమైతే భారీ ప్రాణ నష్టం..

ఎస్​4 బోగీ నుంచి పొగలు రావడాన్ని గుర్తించడం కొంచెం ఆలస్యమైతే పెను ప్రమాదం జరిగేది. పొగను గుర్తించి ట్రైన్​ చైన్​ లాగిన 20 నిమిషాల్లోనే మంటలు వ్యాపించాయని ప్రయాణికులు చెబుతున్నారు. చైన్​ లాగకపోతే ట్రైన్​ స్పీడ్​గా ఉంది కాబట్టి 5 నుంచి 10 నిమిషాల్లోనే మంటలు వ్యాపించే అవకాశముండేదంటున్నారు. ఇదే జరిగితే ఊహించని స్థాయిలో ప్రమాద తీవ్రత ఉండేది. 1990ల్లో కూడా హైదరాబాద్​-–వరంగల్ ​రూట్​లో చర్లపల్లి వద్ద కాకతీయ ప్యాసింజర్​కు మంటలు వ్యాపించి భారీ ప్రాణనష్టం జరిగింది.   

గతేడాది కూడా పగిడిపల్లిలోనే..

గతేడాది ఇదే తరహాలోనే దక్షిణ్​ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లోని పార్సిల్​ బోగీలో మంటలు వ్యాపించాయి. హైదరాబాద్ ​నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న దక్షిణ్​ ఎక్స్​ప్రెస్​2022 జూలై 2న రాత్రి11.45 గంటలకు నాంపల్లి నుంచి బయలు దేరింది. బీబీనగర్​ చేరుకునే సమయానికి పార్సిల్​బోగీలో నుంచి పొగలు రావడాన్ని బీబీనగర్​లోని రైల్వేస్టాఫ్​ గమనించారు. వెంటనే పగిడిపల్లి రైల్వే స్టేషన్​కు సమాచారం ఇచ్చారు. దీంతో పగిడిపల్లి స్టేషన్ ​మాస్టర్ ​సిగ్నల్​ఇవ్వకపోవడంతో ట్రైన్​ ఆగింది. తర్వాత పార్శిల్​ బోగిని తప్పించి ట్రైన్​ను పంపించారు. ఈ ప్రమాదంలో రూ. కోట్ల విలువైన వస్తువులు కాలిపోయాయి. 

అనుమానాలు కలగడానికి కారణాలివీ...

గతేడాది దక్షిణ్​ ఎక్స్​ప్రెస్​ ట్రైన్, ఇప్పుడు ఫలక్​నుమా ట్రైన్​​లో మంటలు వ్యాపించిన ఘటనలు ప్రధాని మోదీ పర్యటనకు ముందు రోజు జరిగినవే కావడం గమనార్హం. గతేడాది జూలై 3(ఆదివారం)న ప్రధాని మోదీ సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అంతకు ముందురోజే అంటే జూలై 2 (శనివారం) రాత్రి దక్షిణ్​ఎక్స్​ప్రెస్​లోని పార్సిల్​ బోగీలో మంటలంటు కున్నాయి. ఈ ఏడాది జూలై 8(శనివారం)న ప్రధాని మోదీ వరంగల్​ వచ్చారు. దానికి ముందు రోజే శుక్రవారం (జూలై 7) ఫలక్​నుమా ట్రైన్​లోని బోగీల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలు అనుకోకుండా జరిగియా..? లేదా ప్లాన్​ ప్రకారం చేసిందా? అన్నది తేలాల్సి ఉంది.