విషాదం నింపిన ఓట్ల పండుగ

విషాదం నింపిన ఓట్ల పండుగ

ఆదిలాబాద్​టౌన్/తూప్రాన్/సంగారెడ్డి/దుబ్బాక/శాయంపేట, వెలుగు: ఓటు వేసేందుకు వెళ్లి, ఓట్ల కోసం ఊళ్లకు వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఆరుగురు చనిపోయారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం..ఆదిలాబాద్​జిల్లా మావల మండల కేంద్రానికి చెందిన తోకల లింగమ్మ(78) ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లింది. ఫిట్స్ రావడంతో కుప్పకూలింది. రిమ్స్​కు తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆదిలాబాద్​లోని భుక్తాపూర్​కు చెందిన చంద్రగిరి రాజన్న(45) ఓటు వేసేందుకు  గర్ల్స్ హైస్కూల్​లోని కేంద్రానికి వెళ్లాడు. 

కొద్దిసేపు క్యూలో నిలబడిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన బాస స్వామి(55) కొంత కాలంగా హైదరాబాద్​లో ఉంటున్నాడు. గురువారం ఓటు వేయడానికి వచ్చాడు. ఓటర్ ​స్లిప్ ​తీసుకుని పోలింగ్​ కేంద్రానికి వెళ్తుండగా కుప్పకూలాడు. స్థానికులు హాస్పిటల్​కు తరలించగా, అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. 

ఓటు వేసేందుకు సొంతూరుకు వెళ్తూ మెదక్​ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  మహిళ చనిపోయింది. నిజాంపేట మండలం చల్మెడకు చెందిన బాజ గణేశ్, లావణ్య భార్యాభర్తలు. పదేండ్లుగా మేడ్చల్ లో ఉంటున్నారు. గురువారం ఓటు వేసేందుకు బైక్​పై చల్మెడ బయలుదేరారు. నేషనల్ హైవే 44పై తూప్రాన్​వద్ద వీరి బైక్​ను వెనుకగా వచ్చిన లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో లావణ్య అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్​కు స్వల్ప గాయాలయ్యాయి. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా నేరేడుపల్లికి చెందిన బోడకుంట్ల రాంబాబు హనుమకొండ జిల్లాలోని గుడిబండల్​వద్ద ఉంటున్నాడు. ఓట్ల కోసం గురువారం తెల్లవారుజామున భార్య, చిన్నకూతురును భూపాలపల్లి బస్సు ఎక్కించాడు. పెద్ద కూతురు సింధువైష్ణవి(7)తో బైక్​పై రాంబాబు ఊరికి బయలుదేరాడు. శాయంపేట మండలం మందారిపేట దాటాక ఎదురుగా వచ్చిన గుర్తుతెలియని వెహికల్ ఢీకొట్టింది. పాప అక్కడికక్కడే చనిపోగా, రాంబాబు తీవ్రంగా గాయపడ్డాడు. అదే టైంలో ఎలక్షన్​డ్యూటీకి వెళ్తున్న డీఎస్పీ వేణుగోపాల్ రెడ్డి ఆగి, 108ను పిలిపించారు. రాంబాబును ఎంజీఎం తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉంది.  

గుండెపోటుతో బూత్​ అసిస్టెంట్ ​మృతి

సంగారెడ్డి జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న బూత్ ​అసిస్టెంట్​గుండెపోటుతో చనిపోయాడు. కొండాపూర్ మండలం గొల్లపల్లికి చెందిన నీరడి సుధాకర్(43) సంగారెడ్డి వెటర్నరీ హెడ్డాఫీసులో అసిస్టెంట్​. ఎన్నికల విధుల్లో భాగంగా బుధవారం పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ పోలింగ్ బూత్ కు వెళ్లాడు. రాత్రి 11గంటల ప్రాంతంలో స్పృహ తప్పి పడిపోవడంతో సిబ్బంది పటాన్ చెరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అప్పటికే గుండెపోటుతో సుధాకర్ చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. వీఆర్ఏగా పని చేసిన సుధాకర్​, 3 నెలల కింద సంగారెడ్డి వెటర్నరీ హెడ్ ఆఫీస్ లో అసిస్టెంట్ గా చేరాడు.