జంతువుల్లా మారేందుకు ఏం చేస్తున్నారంటే...

జంతువుల్లా మారేందుకు ఏం చేస్తున్నారంటే...

ఈ మధ్య జపాన్ లో ఓ వ్యక్తి అచ్చం కుక్కలా కనిపించాలని సుమారు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంత డబ్బు పెట్టి కుక్కలా కనిపించే సూట్ తయారు చేయించుకుని మరీ వేసుకున్నాడు. ఇదంటే ఎలాంటి సర్జరీలు లేకుండా జరిగిపోయింది. కానీ, కొందరైతే సర్జరీలు చేయించుకుని మరీ తమ అవతారాలే మార్చుకున్నారు. 

చిరుత మనిషి​​ 

అసలు పేరు టామ్​ ఉల్​రిడ్జ్​. కానీ, లెపర్డ్​ మ్యాన్​గానే ఎక్కువ పేరు పొందాడు.1935 అక్టోబర్​ 14న బ్రిటన్​లో పుట్టాడు. 28 ఏండ్లు సైన్యంలో పనిచేశాడు. టాటూలంటే విపరీతమైన పిచ్చి. ఒళ్లంతా టాటూ(పచ్చబొట్ల)తో గిన్నిస్​​ రికార్డు ఎక్కాడు. అంతేకాదు, చిరుతపులిలా కనిపించాలని ఒళ్లంతా మచ్చలు పొడిపించుకున్నాడు. అందుకు లక్షల రూపాయలు ఖర్చుచేశాడు. రిటైరయ్యాక స్కాట్లాండ్​లోని ఓ దీవికి మకాం మార్చాడు. అక్కడే ఓ చిన్న ఇంట్లో 20 ఏండ్లు ఉన్నాడు. 2008లో ఒక స్నేహితుడు టామ్​ మనసు మార్చాడు. అప్పుడు టామ్​ బ్రాడ్​ఫోర్డ్​ టౌను శివారులో పెద్ద ఇంటికి మారిపోయాడు. 2016 జూన్​ 12న 80 ఏండ్ల వయసులో చనిపోయాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు  టామ్​  లెపర్డ్​ గిన్నిస్​ రికార్డును చార్లెస్​ హెంకే తుడిచేశాడు. 

బల్లి మనిషి​

అసలు పేరు ఎరిక్​ స్ర్పాగ్​. 1972 జూన్​ 12న అమెరికాలోని ఫోర్ట్​ క్యాంప్​బెల్​ అనే ఊళ్లో పుట్టాడు. ఫిలాసఫీలో పీహెచ్​డీ చేశాడు. అమెరికాలో  ఫ్రీక్​ షో, సైడ్​షో పేరుతో కామెడీ షోలు జరుగుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి మన దగ్గర సర్కస్ లాంటివి. మనుషులే రకరకాల జంతువులు, పక్షుల వేషాలు వేస్తారు. ఇలాంటి వేషాలు వేయడంలో ఎరిక్​ సిద్ధహస్తుడు. తొండ/బల్లిలా కనిపించేందుకు చర్మంపై పొలుసులు వేయించుకున్నాడు. నాలుకను రెండు భాగాలుగా చేయించాడు. పళ్లను షార్ప్​గా మార్పించుకున్నాడు. చెవులను సాగదీయించుకున్నాడు. ఈ అవతారంతో ఎన్నో టీవీ షోలు, సినిమాలు చేసిన ఇతనిపై నేషనల్​ జియోగ్రాఫిక్​ ఛానెల్​ డాక్యుమెంటరీ తీసింది. 

స్టేకింగ్​ క్యాట్​

క్యాట్​ మ్యాన్​గా పేరున్న డెన్నిస్​ అవ్నెర్​ 1958 ఆగస్ట్​ 27న పుట్టాడు. అమెరికాలోని మిషిగన్​ రాష్ట్రంలో ఉన్న ఫ్లింట్ ఇతని సొంతూరు. కానీ సటాన్స్​ బేలో పెరిగాడు. యూఎస్​ నేవీలో సోనార్​ టెక్నీషియన్​గా చేరాడు.1981లో ఉద్యోగం వదిలేసి, కాలిఫోర్నియాలోని శాండియాగోకు వెళ్లాడు. అక్కడ కంప్యూటర్​ ప్రోగ్రామర్​​గా పనిచేశాడు. పిల్లిలా మారాలనే ఆలోచన అక్కడే వచ్చింది. నిజానికి అవ్నెర్​కు చిన్నప్పట్నించే పులులంటే చాలా ఇష్టం. వాటిలా మారాలి అనుకునేవాడు. ఆ కోరిక తీర్చుకునేందుకు శాండియాగోలో ట్రై చేశాడు. ముఖం పిల్లిలా కనిపించాలని దాదాపు15 కాస్మొటిక్​ సర్జరీలు చేయించుకున్నాడు. పై పెదవిని మధ్యలో కట్​ చేయించాడు. నుదురు, కనుబొమలు, పళ్లు, ముక్కు, చేతి వేళ్ల గోళ్లు మార్పించుకున్నాడు. రోబోటిక్​ తోక తగిలించుకున్నాడు. ఈ వేషంతో అవ్నెర్​కి సెలబ్రిటీ హోదా వచ్చింది. స్నేహితులు మోసం చేయడంతో ఆర్థికంగా నష్టపోయి, నెవడా రాష్ట్రంలోని టొనొపాకు మకాం మార్చాడు. 2012 నవంబర్​ 5న అనుమానాస్పదంగా చనిపోయాడు.  

వాంపైర్​ ఉమన్​ 

‘ది జాగ్వార్​ ఉమన్’​ అని పిలిపించుకోవడాన్ని ఇష్టపడుతుంది మారియా జోస్​ క్రిస్టర్నా మెండెజ్. మెక్సికోలో ఓ ఆధ్యాత్మిక కుటుంబంలో 1976లో పుట్టిందామె. క్రిమినల్​ లా లో డిగ్రీ చేసింది. 14 ఏండ్ల వయసులోనే చేతిపై టాటూ (పచ్చబొట్టు) వేయించుకుంది. పెళ్లయ్యాక మారియా గృహ హింసకు గురైంది. దాంతో భర్త నుంచి విడిపోయి, తనలాంటి వాళ్లకి అండగా ఉండేందుకు తన రూపాన్ని వాంపైర్​లా మార్చుకుంది. ఈ రూపం స్వేచ్ఛ, ధైర్యం, బలానికి సంకేతం అంటుంది. వాంపైర్​లా మారడానికి దాదాపు 49 సర్జరీలు చేయించుకుంది. వాటిలో కోరల్లాంటి పళ్లు, నుదుటిపై బొడిపెలు, కనురెప్పలు, ముక్కు, నాలుకను రెండుగా చేయించుకోవడంఈ వంటివి ఉన్నాయి. శరీరంపై దాదాపు 96శాతం టాటూలు వేయించుకున్న మహిళగా గిన్నిస్​ బుక్​లో ఎక్కింది కూడా. లాయర్​గా పనిచేస్తూనే సొంతంగా టాటూ స్టూడియో, బొటిక్​ బిజినెస్ చేస్తోంది.

ప్యారెట్​ మ్యాన్​ 

అందమైన చిలుకలంటే ఇష్టం ఉంటుంది. కానీ, పూర్తిగా చిలుకలా మారేంత ఇష్టం ఉంటుందా? అంటే... టెడ్​ రిచర్డ్స్​ గురించి తెలుసుకోవాలి. బ్రిటన్​లోని బ్రిస్టల్​లో పుట్టాడు రిచర్డ్స్​. షూ ఫ్యాక్టరీలో పనిచేసి రిటైరయ్యాడు. రిచర్డ్స్​కు చిలుకలంటే చిన్నప్పట్నించీ చెప్పలేనంత ఇష్టం. రిటైర్మెంట్​ తరువాత ఒక రోజు చిలుకలా మారితే బాగుండు అనిపించింది రిచర్డ్స్​కు. వెంటనే ముఖంలో మార్పులు చేయించుకున్నాడు. ఆ క్రమంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి.

చెవులు పూర్తిగా కట్​ చేయించుకున్నాడు. దాంతో చెవుడు వచ్చింది. కను బొమలకు రంగులు వేయించుకుంటుంటే ఆ రంగు కంట్లో పడింది. దాంతో చూపు తగ్గిపోయింది. నాలుకను రెండు భాగాలుగా కట్​ చేయించుకున్నాడు. ఆఖరికి తన పేరు కూడా టెడ్​ ప్యారెట్​మ్యాన్​గా మార్చుకున్నాడు. ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీళ్లే కాదు. టైగర్​ లేడీ (కట్జెన్‌‌‌‌–అమెరికా)​, డెవిల్/సాతాన్​ ​(ప్రాడో‌‌‌‌–బ్రెజిల్​), జీబ్రామ్యాన్​(అమెరికా).. ఇలాంటివాళ్లే. పుర్రెకో బుద్ధి అంటే ఇదే అనిపిస్తుంది.