ఈ సండే స్పెషల్.. వంకాయతో వెరైటీ వంటకాలు..ఒక్కసారి ట్రై చెయ్యండి

ఈ  సండే స్పెషల్.. వంకాయతో వెరైటీ వంటకాలు..ఒక్కసారి ట్రై చెయ్యండి

వంకాయ అనగానే గుత్తివంకాయ గుర్తొచ్చేస్తుంది. కానీ, వంకాయల్లో రంగులు, ఆకారాలు రకరకాలు ఉంటాయి. ఏ వంకాయలు అయినా సరిగ్గా వండితే రుచికరంగా ఉంటాయి. కావాలంటే ఈ రెసిపీలు ట్రై చేయండి. పొడవు వంకాయలతో రుచికరమైన వంటల్ని ఆస్వాదించండి.  

నువ్వుల కూర

కావాల్సినవి :
వంకాయ ముక్కలు – అర కిలో
నువ్వులు – పావు కప్పు
వెల్లుల్లి రెబ్బలు – నాలుగు 
ఎండు మిర్చి – పది
నూనె, ఉప్పు – సరిపడా
ఆవాలు – అర టీస్పూన్
జీలకర్ర, ధనియాల పొడి, కారం – ఒక్కో టీస్పూన్
కరివేపాకు – కొంచెం
పసుపు – అర టీస్పూన్
చింతపండు రసం – పావు కప్పు

తయారీ :

పాన్​లో నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి వేసి నూనెలేకుండా వేగించాలి. చల్లారిన తర్వాత వాటిన్నింటినీ మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేయాలి. పాన్​లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగించాలి. వంకాయ ముక్కలు వేసి ఒకసారి కలిపాక, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి మరోసారి కలపాలి. మూతపెట్టి కాసేపు ఉడికించాలి. ఆ తర్వాత రెడీ చేసుకున్న నువ్వుల మిశ్రమం కూడా వేసి కలపాలి. కాసేపయ్యాక అందులో చింతపండు రసం, కారం వేసి కలిపి మూతపెట్టాలి. నూనె పైకి తేలేవరకు సన్నమంట మీద ఉడికించాలి. చివరిగా కొత్తమీర చల్లుకుంటే సరి. 

వంకాయ కారం 

కావాల్సినవి :
వంకాయలు – అరకిలో
ఎండు మిర్చి – 50 గ్రాములు
ఎండు కొబ్బరి ముక్కలు – 
మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర, నువ్వులు – ఒక్కో టేబుల్ స్పూన్
పుట్నాలు, ధనియాలు –
 ఒక్కోటి రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు, నూనె – సరిపడా
పసుపు – అర టేబుల్ స్పూన్
ఉల్లిగడ్డ తరుగు – పావు కప్పు
కొత్తిమీర – కొంచెం

తయారీ :పాన్​లో ఎండు కొబ్బరి ముక్కలు, ఎండు మిర్చి, జీలకర్ర, నువ్వులు, పుట్నాలు, ధనియాలు ఒకదాని తర్వాత ఒకటి వేసి నూనె లేకుండా వేగించాలి. అవన్నీ చల్లారాక మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి కలపాలి. వంకాయలు నిలువుగా కట్​ చేసి ఆ నీళ్లలో వేసి కడగాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి వంకాయలు వేసి వేగించాలి. చల్లారిన తర్వాత వంకాయ మధ్యలో రెడీ చేసుకున్న కారం పొడిని స్టఫింగ్ చేయాలి. అలా రెడీ చేసుకున్న వాటిని వేడి వేడి నూనెలో ఉల్లిగడ్డ తరుగు వేసి వేగించాలి. ఆ తర్వాత కొత్తిమీర, స్టఫ్ చేసిన వంకాయలను చెదిరిపోకుండా పెనంలో పెట్టాలి. మిగిలిన కారం పొడిని చల్లి, మరికాసేపు వేగించాలి. 

ఫింగర్స్

కావాల్సినవి :
వంకాయలు, కోడిగుడ్లు – రెండేసి చొప్పున
ఉప్పు, బ్రెడ్ క్రంబ్స్ – సరిపడా
కారం, మిరియాల పొడి – ఒక్కో అర టీస్పూన్
చాట్ మసాలా – పావు టీస్పూన్​
నిమ్మరసం – ఒక టీస్పూన్​
బియ్యప్పిండి – ఒక కప్పు

తయారీ : వంకాయల్ని ముక్కలపై చెక్కు తీసేసిన తర్వాత సన్నగా కట్ చేయాలి. వాటిని ఉప్పు నీళ్లలో వేసి కడిగి ఒక గిన్నెలో వేయాలి. తర్వాత ఉప్పు, మిరియాల పొడి, కారం, చాట్ మసాలా, నిమ్మరసం వేసి కలపాలి. మూతపెట్టి పావుగంట సేపు పక్కన ఉంచాలి. ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి బాగా కలపాలి. మరో గిన్నెలో బియ్యప్పిండి, మిరియాల పొడి, ఉప్పు వేసి కలపాలి. మారినేట్ చేసిన వంకాయ ముక్కల్ని బియ్యప్పిండి వేసి కలిపి, తర్వాత కోడిగుడ్ల సొనలో ముంచాలి. ఆపై వాటిని బ్రెడ్ క్రంబ్స్​లో దొర్లించాలి. అలా రెడీ చేసుకున్న వాటిని వేడి వేడి నూనెలో వేసి గోల్డెన్ బ్రౌన్​ కలర్ వచ్చేవరకు వేగించాలి.