
బెంగళూరు: రాబోయే విమెన్స్ వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లను బెంగళూరులో నిర్వహించడంపై అనిశ్చితి నెలకొంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌కు ఇండియా అతిథ్యం ఇవ్వనుంది. బెంగళూరుకు నాలుగు మ్యాచ్‌లు కేటాయించింది. అయితే, కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచ్‌లు నిర్వహించడానికి అనుమతి పొందలేదని తెలుస్తోంది.
పైగా, కేఎస్‌సీఏ ఇదే స్టేడియంలో ఈ నెల 11 నుంచి మహారాజా ట్రోఫీ టీ20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి నగర పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ టోర్నీని బెంగళూరు నుంచి మైసూరులోని వడియార్ క్రికెట్ స్టేడియానికి మార్చారు. ఐపీఎల్ విక్టరీ సెలబ్రేషన్స్ సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు మరణించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నందున పోలీసులు అనుమతులు ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తోంది.
వరల్డ్ కప్ మ్యాచ్‌ల నిర్వహణకు కూడా బెంగళూరు పోలీసులు, కర్నాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం ఉందని బీసీసీఐ, ఐసీసీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ టోర్నమెంట్‌లోని మొత్తం నాలుగు మ్యాచ్‌లను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించాల్సి ఉంది. ఇందులో సెప్టెంబర్ 30న జరగాల్సిన ప్రారంభ మ్యాచ్ కూడా ఉంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జట్లుగా ఇండియా, శ్రీలంక తలపడాల్సి ఉంది.
అంతేకాకుండా, ఒక సెమీఫైనల్ మ్యాచ్‌తో పాటు మరో రెండు లీగ్ మ్యాచ్‌లను కూడా బెంగళూరులో షెడ్యూల్ చేశారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతులు రాకపోవడంతో ఈ అన్ని మ్యాచ్‌లపై సందిగ్ధత నెలకొంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే, బెంగళూరుకు కేటాయించిన మ్యాచ్‌లను వేరే నగరాలకు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని బీసీసీఐ, ఐసీసీ అధికారులు భావిస్తున్నారు.
దీనిపై కేఎస్‌సీఏ అధికారి ఒకరు మాట్లాడుతూ, తాము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశామని, స్పందన కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ‘ప్రభుత్వం అనుమతి నిరాకరించలేదు. ఒకవేళ అదే పాలసీ అయితే మైసూరులో మహారాజా కప్‌కు కూడా అనుమతి ఇచ్చేవారు కాదు’ అని అన్నారు. వరల్డ్ కప్ మ్యాచ్‌లకు ఇంకా సమయం ఉందని, తాము దశలవారీగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.