చెన్నై: ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్‌పై తమ కున్న అభిమానాన్ని చెన్నైస్ అమృత విద్యాసంస్థల విద్యార్థులు వినూత్నంగా చాటుకున్నారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో చెన్నైస్ అమృత విద్యాసంస్థల వార్షిక క్రీడోత్సవంలో భాగంగా దినేష్ కార్తిక్ జెర్సీ నంబర్ “19” ఆకారంలో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి అమృత విద్యాసంస్థలకు చెందిన సుమారు 3 వేల మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరంత కలిసి “సీఏ♡డీకే19” అనే ఆకారంలో మానవహారాన్ని ఏర్పాటు చేసి అబ్బురపర్చారు.
ఒక క్రీడాకారుడి జెర్సీని ప్రతిబింబించే మానవహారంలో అత్యధిక మంది విద్యార్థులు పాల్గొన్న రికార్డు”గా ఈ వినూత్న కార్యక్రమాన్ని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు లభించింది. చెన్నైస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ చైర్మన్ ఆర్.భూమినాథన్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ క్రికెటర్, ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తిక్, గౌరవ అతిథిగా తమిళనాడు డాక్టర్ ఎం.జి.ఆర్ మెడికల్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కె.నారాయణ స్వామి పాల్గొన్నారు.
►ALSO READ | Jasprit Bumrah: బుమ్రా ఎంట్రీపై బిగ్ అప్డేట్.. ఫుల్ ఖుషీలో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్
విద్యార్థుల్లో కృషి, పట్టుదల, బృంద స్ఫూర్తి, సమన్వయం, సహనం వంటి విలువలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని భూమినాథన్ తెలిపారు. క్రీడలతో వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని ఈ కార్యక్రమం మరోసారి నిరూపించిందన్నారు. ఈ క్రీడోత్సవంలో క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, అథ్లెటిక్స్‌తో పాటు వివిధ క్రీడాల్లో విజయవంతంగా పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు.
