
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఉపాధి హామీ కూలీలు వడదెబ్బ బారిన పడకుండా చర్యలు చేపట్టాలని డీఆర్డీఓలకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల డైరెక్టర్ సృజన ఆదేశాలు జారీ చేశారు. మంత్రి సీతక్క సూచన మేరకు ఉత్తర్వులను వెలువరించారు. ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు సమీపంలో కూలీలు సేద తీరేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేయాలని, తాగునీటిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
మధ్యాహ్నం వేళ పనులు చేయించొద్దని, ఉదయం, సాయంత్రం 4 తర్వాతే పనులు చేయించాలని తెలిపారు. ప్రతిరోజు 10 లక్షల మంది ఉపాధి కూలీలకు పని కల్పించాలని టార్గెట్ పెట్టుకోగా.. ఇప్పటి వరకు 9.45 లక్షల మందికి ప్రతిరోజు ఉపాధి లభిస్తోంది. ప్రతి జీపీలో సగటున 75 మంది కూలీలకు ఉపాధి హామీ పని లభిస్తుండగా.. ఈ సంఖ్యను100కు పెంచేలా కూలీలను మోబిలైజ్ చేయాలన్నారు. అన్ని గ్రామపంచాయతీల్లో విధిగా ఉపాధి పనులు చేపట్టేలా డీఆర్డీఓలు చర్యలు చేపట్టాలని కోరారు.