- ట్రేడింగ్‌లో లాభాల పేరుతో డబ్బులను కాజేసిన దంపతులు
జూబ్లీహిల్స్, వెలుగు: ప్రముఖ డైరెక్టర్ తేజ కుమారుడు అమితావ్ తేజకు ట్రేడింగ్ పేరుతో దంపతులు కుచ్చుటోపీ పెట్టారు. రూ.63 లక్షలు కాజేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్–45లో ఉండే అమితావ్ తేజ సినిమాలు చేయడంతో పాటు ఇతర వ్యాపారాలు చేస్తుంటారు. అతడికి ఏడాదిన్నర క్రితం మోతీనగర్‌కు చెందిన అనూష, ప్రణీత్ దంపతులు పరిచయమయ్యారు. ఈ క్రమంలో ట్రేడింగ్ లో డబ్బులు పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయంటూ వారు ఆశ చూపారు. దీంతో అమితావ్ తేజ వారికి రూ. 63 లక్షలు నగదు ఇచ్చారు.
ఆ దంపతులు 20 రోజుల తర్వాత ట్రేడింగ్‌లో రూ.9 లక్షలు లాభాలు వచ్చాయని పత్రాలను చూపించారు. అమితావ్ వాటిని పరిశీలించగా నకిలీ పత్రాలు అని తేలింది. దీంతో వారిని నిలదీయగా మోతీనగర్‌లోని తమ ప్లాటును బదిలీ చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇటీవల దాని గురించి ప్రస్తావించగా దంపతులు భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో అమితావ్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
