హుస్నాబాద్, వెలుగు: తెలంగాణ మట్టి కథ 'బలగం' చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు వేణు యెల్డండి మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. తన తదుపరి చిత్రం 'ఎల్లమ్మ' షూటింగ్ ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన చిత్ర బృందంతో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు.
ముందుగా ఉమ్మాపూర్ గ్రామంలో వెలసిన శ్రీ త్రిపుర భైరవి సమేత మహా కాలభైరవ క్షేత్రాన్ని వేణు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు శ్రీకాంత్ చార్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొత్త ప్రాజెక్ట్ విజయవంతం కావాలని మొక్కుకున్నారు. అనంతరం ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు.
దర్శకుడు వేణు తన రెండో సినిమాగా 'ఎల్లమ్మ' అనే టైటిల్‌తో పక్కా లోకల్ కథను సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం హుస్నాబాద్ సమీపంలోని మహాసముద్రం గండి ప్రాంతాన్ని పరిశీలించారు. సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను ఇక్కడి కొండలు, కోనల మధ్య చిత్రీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో వేణు వెంట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు బింగి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్, సినిమా బృందం సభ్యులు, స్థానిక అభిమానులు ఉన్నారు.
