
అసెంబ్లీలో ప్రశ్నల వర్షం కురిపించిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు
విద్యారంగ సమస్యలు ఏకరువు పెట్టిన నేతలు
ఆంధ్ర కాలేజీల సంగతి చూడాలని డిమాండ్
సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మరోసారి గళమెత్తారు. విద్యారంగ సమస్యలపై ఏకరువు పెట్టారు. అసెంబ్లీలో విద్యారంగ పద్దులపై జరిగిన చర్చలో అధికార టీఆర్‌ఎస్ సభ్యులు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను ఆ శాఖ మినిస్టర్ వద్ద లేవనెత్తారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులను నియంత్రిస్తామని ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి సమాధానమివ్వగా, ముందు ఆంధ్రకు చెందిన శ్రీచైతన్య, నారాయణ కాలేజీల సంగతి చూడాలని ఓ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో వీసీ పోస్టుల భర్తీపై మరో ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానమిచ్చారు. ఇంటర్ ఫలితాల్లో తప్పులు, ఆత్మహత్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకూ జవాబిచ్చారు. ‘‘ఇంటర్ పరీక్షల్లోనే కాదు.. ఎవరు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం బాధపడుతుంది. ఆత్మహత్య చేసుకోవడం పరిష్కారం కాదు. పరీక్షలో తప్పులు జరిగాయా లేదా అన్నది తేల్చడానికి కమిటీ వేశాం. రిపోర్ట్ వచ్చింది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం” అని స్పష్టం చేశారు.
బడులు కూలిపోయేట్టున్నయి
స్కూల్ ఎడ్యుకేషన్ పద్దు రూ.8,209 కోట్లు పెట్టుకున్నం. నా నియోజకవర్గంలో కూలిపోయే దశలో చాలా స్కూళ్ల బిల్డింగులు ఉన్నాయి. స్కూల్ ఎడ్యుకేషన్ పద్దులో కొత్త భవనాల కోసం ఏమైనా ప్రొవిజన్స్ పెట్టారా? వీటి ప్రపోజల్స్ ఎమ్మెల్యేల ద్వారా తెచ్చుకొని, శాంక్షన్ చేస్తే బాగుంటుందని నా సూచన.
‑ హన్మంత్ షిండే (టీఆర్‌ఎస్, జుక్కల్ )
కాలేజీ బిల్డింగ్ త్వరగా కట్టించండి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 2009లో జూనియర్ కాలేజీ శాంక్షన్ అయినా, దానికి బిల్డింగ్ లేదు. బహదూర్‌పల్లిలో 1.20 ఎకరాల్లో కొత్త బిల్డింగ్‌కు శాంక్షన్ చేసుకున్నాం. కానీ ఇంకా పనులు పూర్తికాలేదు. బిల్డింగ్ లేక 500 మంది విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
‑ వివేకానంద (టీఆర్‌ఎస్, కుత్బుల్లాపూర్)
బాత్‌రూమ్‌లు కట్టించండి
నారాయణఖేడ్‌లో స్కూళ్లు కూలిపోయే దశలో ఉన్నాయి. పెచ్చులూడుతున్నయి. ఎక్కడెక్కడ అవసరమున్నాయో అక్కడ కొత్త గదులు మంజూరు చేయాలి. జూనియర్ కాలేజీలు, హైస్కూళ్లలో బాత్‌రూమ్‌లు లేవు. అమ్మాయిలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాడైన గదులను వెంటనే బాగుచేయాలి
‑ భూపాల్‌రెడ్డి (టీఆర్‌ఎస్, నారాయణఖేడ్)