ఏ ఊరు ఎవరికి.?..సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చ

ఏ ఊరు ఎవరికి.?..సర్పంచ్ రిజర్వేషన్లపై గ్రామాల్లో చర్చ
  • రొటేషన్ లో మారనున్న రిజర్వేషన్లు
  • రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం
  • రాష్ట్రంలోని12,760  గ్రామాల్లో ఉత్కంట
  • సర్పంచ్ రిజర్వేషన్లు ఫైనల్ చేసే బాధ్యత ఆర్డీవోలకు
  • వార్డు మెంబర్ల బాధ్యత ఎంపీడీవోలకు
  • సమాన జనాభా ఉంటే లాటరీ ద్వారా ఖరారు
  • ఆరాదీస్తున్న ఆశావహులు

 పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. డిసెంబర్ లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్దమైంది. అయితే పాత రిజర్వేషన్ల శాతం ప్రకారమే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు 50 శాతం పరిమితితో సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉన్న రిజర్వేషన్లు మారనున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను ఖరారు చేయనున్నారు. దీంతో గ్రామ పంచాయతీల్లో వార్డు సభ్యులు, సర్పంచుల రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. నిన్న డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ల జాబితాను సిద్ధం చేస్తున్నారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. దీంతో ఇప్పుడున్న కేట గిరికి కాకుండా మరో దానికి మారే అవకాశం ఉంది. ఇదే క్రమంలోవార్డు సభ్యుల రిజర్వేషన్లు కూడా మారే అవకాశం ఉంది. అయితే ఏఊరు ఎవరికనేది సోమ, మంగళ వారాల్లో తేలే అవకాశం ఉంది.

12,760 గ్రామాల్లో అటెన్షన్ 

రాష్ట్రంలోని 31 జిల్లాల పరిధిలో ఉన్న 545 మండలాల్లోని 12,760 గ్రామాలు, 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 2024 సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులసర్వే ప్రకారం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. అదే విధంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. జనాభాప్రాతిపదికనే రిజర్వేషన్లను ఫైనల్ చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా సర్పంచుల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డుల రిజర్వేషన్లను ఎంపీడీవోలు ఖరారు చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా రిజర్వేషన్లను ఫైనల్ చేస్తారు. ఈ క్రమంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు.