
- ప్రారంభించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ప్రతిపక్షాల తరఫున రాహుల్ మాట్లాడే అవకాశం
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమై వారం రోజులు గడిచింది. పోయిన వారం మొత్తం అపోజిషన్ పార్టీల ఆందోళనలతో ఉభయ సభలు సజావుగా సాగలేదు. బిహార్‌లో చేపడుతున్న ఓటర్ల సవరణపై ప్రతిపక్షాలు నిరసన తెలిపాయి. తాజాగా సోమవారం నుంచి ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడిపై ఉభయ సభల్లో సభ్యులు చర్చించనున్నారు. జాతీయ భద్రత, విదేశీ విధానాలకు సంబంధించిన అంశాలు కావడంతో ఇరుపక్షాల మధ్య వాడీవేడి చర్చలు కొనసాగే అవకాశాలున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో 16 గంటల చొప్పున ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడి ఘటనపై చర్చిస్తారు. లోక్‌సభలో డిబేట్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభిస్తారు. ఉభయ సభల్లో అటు ఎన్డీయే తరఫున కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్ మాట్లాడతారని సమాచారం. ఇటు అపోజిషన్ పార్టీ కూటమి నుంచి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాది పార్టీ నుంచి అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర పార్టీల్లోని కీలక నేతలు ఆపరేషన్ సిందూర్, పహల్గాం దాడిపై మాట్లాడుతారు. సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరగనున్నది.
డిబేట్లో ప్రతినిధుల బృందం!
ఆపరేషన్ సిందూర్ గురించి తెలియజేసేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు సుమారు 30 దేశాల్లో పర్యటించారు. వారిలో కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంశు త్రివేది, నిశికాంత్ దుబే ఉన్నారు. మొత్తం 8 పార్టీలకు చెందిన నేతల బృందం పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాల్లో ఎండగట్టింది. శివసేన నుంచి శ్రీకాంత్ షిండే, జేడీయూ నుంచి సంజయ్, టీడీపీ నుంచి హరీశ్ బాలయోగి, కాంగ్రెస్ నుంచి శశిథరూర్ తదితరులు ఉన్నారు. వీరందరిని
ఉభయ సభల్లో మాట్లాడించే అవకాశాలున్నాయి.