
హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వంద మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇరిగేషన్‌లో ఐడీసీ (ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) విలీనం కాకముందు అసిస్టెంట్ ఇంజనీర్లు, డీటీపీ ఆపరేటర్లు, నాన్ టెక్నికల్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఆఫీస్ సబార్డినేట్లు, వాచ్‌మన్‌లు సహా మొత్తం వంద మందికిపైగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వారిలో కొందరు 15 ఏండ్లుగా, మరికొందరు ఏడు నుంచి 14 ఏండ్లుగా డ్యూటీలు చేస్తున్నారు. ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ రీ ఆర్గనైజేషన్ తర్వాత వీరిని 19 చీఫ్ ఇంజనీర్ల టెరిటోరియల్ పరిధిలో సర్దుబాటు చేశారు. వీళ్ల కాంట్రాక్టును ప్రతి ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి మరుసటి ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇస్తున్నారు. అయితే ఇటీవల ఈఎన్సీ (జనరల్) మురళీధర్ ఆధ్వర్యంలో సమావేశమైన కమిటీ ఐడీసీ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కొనసాగించరాదని నిర్ణయం తీసుకుంది. దీంతో వారికి రెన్యువల్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తమను కొనసాగించాలని కోరుతూ ఈఎన్సీ (అడ్మిన్) అనిల్ కుమార్‌ను కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు బుధవారం కలిసి వినతిపత్రం ఇచ్చారు.