- సమస్యల పరిష్కారానికి లంచావతారం
- ఎత్తడంతో సర్కారు నిర్ణయం?
- అవినీతి, అక్రమాలకు పాల్పడే ఆఫీసర్లపైనా నిఘా
- ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్
- చదివిన వారిని రిక్రూట్ చేసుకునే ఆలోచన
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్‌లో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కలెక్టర్ కార్యాలయాలు, ఎమ్మార్వో ఆఫీసుల్లో ధరణి పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా? వద్దా? అనే విషయంలో త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. భూముల సమస్యలు, మ్యుటేషన్ కోసం వస్తున్న వారి నుంచి కొంతమంది ధరణి ఔట్ సోర్సింగ్ఉద్యోగులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
కొన్నిచోట్ల కలెక్టర్లకు తెలియకుండా అక్రమంగా భూములను అటు ఇటు చేసినట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాలో గతంలో ఇదే విషయమై పోలీసు కేసు కూడా నమోదైంది. ధరణి పోర్టల్ భూములకు సంబంధించిన పనులు చేసేందుకు జిల్లాస్థాయిలో ఈడీఎం ( ఈ--డిస్ట్రిక్ట్ మేనేజర్)లు, ఉన్నతాధికారులు సైతం అక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దీంతో వారిపైనా నిఘా పెట్టినట్టు తెలుస్తున్నది. ఒకవైపు కొత్త ఆర్ఓఆర్ యాక్ట్ ను తీసుకొస్తుండగా.. ఇంకోవైపు రైతులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తున్న అక్రమ ఆఫీసర్లను సెట్ రైట్ చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ, బీకాం కంప్యూటర్స్ చదివిన నిరుద్యోగ యువతను పోటీ పరీక్షల ద్వారా రిక్రూట్ చేసుకుంటే ఎలా ఉంటుందనే దానిపైనా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది.
ఆపరేటర్లు ఆడిందే ఆట..
ధరణి పోర్టల్ ఏర్పాటు సమయంలో ఆయా మండలాల్లోని వ్యవసాయ భూముల రికార్డుల డేటా ఎంట్రీ సమయంలో చాలా వరకు తప్పులు దొర్లాయి. దీంతో చాలామంది రైతులు, భూములు కలిగిన వారు తహసీల్దార్ కార్యాలయాలు, మీ సేవా కేంద్రాల చుట్టూ తిరిగి తిరిగి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని మండల కేంద్రాల్లో పని చేస్తున్న ధరణి పోర్టల్ ఆపరేటర్లు ఆడిందే ఆట.. పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ధరణి పోర్టల్‌లో లోపాలు సరి చేయాలని తమ వద్దకు వచ్చే రైతుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ఘటనలు చాలా ఉన్నాయి. ఇదిలా ఉంటే రంగారెడ్డి కలెక్టరేట్ కేంద్రంగా గతంలో కలెక్టరేట్‌లోని ధరణి ఆపరేటర్లను ఆకట్టుకొని, కోట్ల రూపాయలు ముట్టజెప్పిన రియల్టర్లు.. ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములను ప్రైవేట్వ్యక్తుల పేర రాయించినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లో తేలింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని బడా నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు కలిసి సర్కార్ భూములను చెరబట్టినట్టు గుర్తించారు. నగర, శివారు ప్రాంతాల్లో రూ. వేల కోట్ల విలువైన ప్రభుత్వ, కాందిశీకుల భూములకు పాస్‌బుక్‌లు జారీ చేసినట్టు బయటపడింది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల ముందు తనకు తెలియకుండా ధరణిపోర్టల్‌లో 98 దరఖాస్తులు క్లియర్ అయ్యాయని, దీనిపై విచారణ జరపాలని అప్పటి రంగారెడ్డి కలెక్టర్ భారతి హోళికెరి ఆదిభట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్క రంగారెడ్డిలోనే కాకుండా అన్ని జిల్లాల్లోనూ ఈ తంతు కొనసాగుతున్నట్టు తెలిసింది.
టెక్నికల్ పేరుతో ఈడీఎంల అక్రమాలు
ధరణి పోర్టల్‌లో కలెక్టర్ స్థాయిలో జరుగుతున్న అప్లికేషన్ల విషయంలో ఈడీఎం(ఈ-–డిస్ట్రిక్ట్ మేనేజర్)ల పాత్రపైనా రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీస్తున్నది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, వికారాబాద్జిల్లాలతోపాటు మరో 15 జిల్లాల్లో ఉన్న ఈడీఎంలు ధరణిలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఇంటెలిజెన్స్ నివేదిక అందింది. ప్రధానంగా గతంలో మేడ్చల్ మల్కాజ్‌గిరిలో చేసి..మళ్లీ రంగారెడ్డి జిల్లాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈడీఎంపై ప్రభుత్వానికి కంప్లయింట్స్ అందాయి.
సాధారణంగా కలెక్టర్లు ధరణి అప్లికేషన్లు చేసే సమయంలో ఆపరేటర్లు, ఈడీఎంల సాయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రంగారెడ్డి ఈడీఎం కూడా అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తున్నది. మంగళవారం అడిషనల్ కలెక్టర్ పట్టుబడటంతో ఈ వ్యవహారంలో ఈడీఎం పాత్రపై ఆరా తీస్తున్నారు.
