కొత్త ఫీజులా.. పాతవా?.. ఇంజినీరింగ్ ఫీజులపై ఇంకా తొలగని అయోమయం

కొత్త ఫీజులా.. పాతవా?.. ఇంజినీరింగ్  ఫీజులపై ఇంకా తొలగని అయోమయం
  •     ఈ ఏడాది పాత ఫీజులే ఉంటాయని ఇప్పటికే సర్కారు ఉత్తర్వులు 
  •     హైకోర్టు ఆదేశాలతో మళ్లీ కొత్త ప్రపోజల్స్ 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్  కాలేజీల్లో ఫీజుల పంచాయితీ ఇంకా కొలిక్కి రాలేదు. ఈ అకాడమిక్  ఇయర్  2025–26 నుంచి కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయా, లేక పాత వాటినే కంటిన్యూ చేస్తారా? అన్న విషయంలో స్టూడెంట్స్, పేరెంట్స్‌‌‌‌లో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఈ ఏడాది పాత ఫీజులనే కొనసాగిస్తామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. కానీ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. 

దీంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త ఫీజుల ఖరారుపై అధికారులు కసరత్తు పూర్తి చేశారు. తెలంగాణ అడ్మిషన్స్  అండ్  ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ ఇప్పటికే కొత్త ఫీజుల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. ఆ ఫైల్ ప్రస్తుతం సర్కారు వద్ద పెండింగ్‌‌‌‌లో ఉంది.  ఈ ఏడాది ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025–26, 2026–27, 2027–28  విద్యా సంవత్సరాలకు కొత్త ఫీజులను టీఏఎఫ్ఆర్సీ ఖరారు చేయాల్సి ఉంది. 

దీనికి అనుగుణంగానే కాలేజీల ఆదాయ వ్యయాలకు అనుగుణంగా 157 ప్రైవేటు కాలేజీల్లో ఫీజులను ప్రాథమికంగా ఫైనల్  చేసింది. అయితే ముందుగా పంపిన ప్రతిపాదనల్లో భారీగా ఫీజులు పెంచడంపై సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే ఈ విద్యా సంవత్సరం పాత ఫీజులే ఉంటాయని ఏకంగా ప్రభుత్వం జీఓ రిలీజ్  చేసింది. దీనిపై కొందరు కోర్టుకు పోవడంతో మళ్లీ కొత్త ఫీజుల ప్రతిపాదనలు రెడీ చేసింది. 

దీంతో టీఏఎఫ్‌‌‌‌ఆర్సీ మళ్లీ కాలేజీలతో సమావేశాలు పెట్టి, కాలేజీల ఆదాయవ్యయాలు, అకాడమిక్  అంశాలను పరిగణనలోకి తీసుకొని ఫీజులను ఫైనల్  చేసి ప్రభుత్వానికి పంపింది. కాగా, గత బ్లాక్  పీరియడ్‌‌‌‌తో పోలిస్తే ఈసారి ఫీజులు స్వల్పంగానే పెరిగే అవకాశం ఉందని, మరీ భారీగా ఉండకపోవచ్చని ఆఫీసర్లు చెప్తున్నారు. దాదాపు నెలన్నర క్రితం కొత్త ఫీజుల కోసం టీఏఎఫ్ఆర్సీ సర్కారుకు ప్రతిపాదనలు పంపించగా.. ఇప్పటికీ అధికారికంగా జీఓ బయటకు రాలేదు. 

జీఓ వస్తేనే క్లారిటీ.. 

ఫీజుల ఫైల్  ప్రభుత్వం వద్ద ఉన్నప్పటికీ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోడ్ తో జీఓ విడుదలకు బ్రేక్  పడింది. జీఓ జారీ చేసేందుకు అనుమతి ఇవ్వాలని విద్యా శాఖ ఇప్పటికే ఎన్నికల కమిషన్  (ఈసీ) ని కోరినట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. 

దీంతో కొత్త జీఓ రాకపోవడంతో ఈ ఏడాది ఏ ఫీజులు ఉంటాయనే ఆందోళన అటు పేరెంట్స్, ఇటు స్టూడెంట్లలో  కొనసాగుతోంది.  ఇప్పటికే మేనేజ్ మెంట్లు మాత్రం.. ఫీజులు భారీగా పెరుగుతాయని ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే జీఓ రిలీజ్ చేసి, ఈ ఫీజుల గందరగోళానికి తెరదించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేస్తున్నారు.