టెట్ రూటే సపరేట్.. ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహణ

టెట్ రూటే సపరేట్.. ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహణ
  • ఎడిట్ ఆప్షన్ లేకుండానే ఎగ్జామ్ నిర్వహణ
  • కొత్త వసతుల్లేకున్నా ప్రతిసారీ ఫీజు పెంపు 
  • ఎస్సీ, ఎస్టీలకూ ఫీజు మినహాయింపు లేదు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) అధికారుల తీరుతో అభ్యర్థులకు తిప్పలు తప్పడంలేదు. ఎడిట్ ఆప్షన్​ ఇవ్వకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ నెల 2 నుంచి టెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కాగా ఈనెల16వరకూ దరఖాస్తుకు అవకాశముంది. ఇప్పటివరకూ లక్షకు పైగా అప్లికేషన్లు వచ్చాయి. అయితే చాలామంది అప్లికేషన్లలో చిన్నచిన్న తప్పులు వస్తుండటంతో వారంతా ఏమైనా సమస్యలు వస్తాయోనని.. రెండోసారి ఫీజు కట్టి మళ్లీ అప్లై చేస్తున్నారు. 

జనరల్​గా ఏ పరీక్షకైనా ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. కానీ టెట్ కు ఆ ఛాన్స్ మాత్రం ఇవ్వడం లేదు. గతంలో ఎప్పుడూ ఇవ్వలేదు కాబట్టి ఈ సారి కూడా ఇవ్వబోమనీ ఎస్​సీఈఆర్టీ అధికారులు చెప్తున్నారు. అయితే దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ లింక్ వస్తున్నా.. అది డౌన్ లోడ్ కావడం లేదు. టెక్నికల్ ప్రాబ్లమ్ ఉందని అధికారులు చెప్తున్నారని అభ్యర్థులు పేర్కొంటున్నారు. ఈ ప్రాబ్లమ్ ఉంటే అప్లికేషన్లు ఎందుకు తీసుకుంటారని వారంతా మండిపడుతున్నారు. మరోపక్క ఏ నోటిఫికేషన్ అయినా కన్వీనర్ పేరుతో ఇస్తారు. కానీ ఈ సారి టెట్ చైర్మన్ పేరుతో ఇవ్వడం గమనార్హం. 


ఫీజులు 300 నుంచి 400
కొత్తగా సెంటర్లలో ఎలాంటి వసతులు కల్పించకుండానే..ఫీజు మాత్రం పెంచేశారు. గతంలో రూ.300 ఉంటే ఈసారి 400కు పెంచారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీటెట్​లో ఎస్సీ, ఎస్టీలకు ఫీజు మినహాయింపు ఉంటుంది. కానీ టీఎస్ టెట్ కు మాత్రం ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఓసీ అభ్యర్థులతో సమానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు చెల్లించాల్సి వస్తోంది.

పేరుకే హెల్ప్ డెస్క్..
టెట్ అభ్యర్థుల అనుమానాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన టెట్ హెల్ప్ డెస్క్ నామమాత్రంగానే మారిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నాలుగైదు నెంబర్లు ఇచ్చినా.. దాంట్లో కేవలం ఒక్కరు మాత్రమే మాట్లాడుతున్నారని చెప్తున్నారు. ఒక నెంబర్ ఎప్పుడూ స్విచ్చాఫ్ ఉంటుందని, ల్యాండ్ లైన్ నెంబర్ ఎత్తడం లేదని చెబుతున్నారు.

అప్లికేషన్లు 1.45 లక్షలు
టెట్ అప్లికేషన్ల సంఖ్య లక్షన్నర దాకా చేరింది. బుధవారం సాయంత్రం నాటికి 1,45,622 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ 1 కు 46,896 మంది, పేపర్ 2కు 6,900 మంది, రెండు పేపర్లకూ 91,826 మంది అప్లై చేశారు. పేమెంట్ మాత్రం 1,56,889 మంది చేశారు. అప్లికేషన్ల ప్రక్రియ ఈనెల 16 వరకూ కొనసాగనున్నది.