ఫ్రీగా మట్టి గణపతుల పంపిణీ.. మీ ఏరియాలో ఉందేమో..

ఫ్రీగా మట్టి గణపతుల పంపిణీ.. మీ ఏరియాలో ఉందేమో..

హైదరాబాద్: పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులనే పూజించాలని హెచ్ఎండీఏ చెబుతోంది. ఆ ఉద్దేశంతోనే గత నాలుగేళ్లుగా ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తోంది.  ఈ ఏడాది కూడా సిటీలో 38 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి విగ్రహాల పంపిణీని అధికారులు మొదలు పెట్టారు. హైదరాబాద్‎లో వినాయక చవితికి గల్లీ గల్లీలో గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తారు. వీటిల్లో ఎక్కువగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‎తో తయారు చేసిన భారీ సైజ్ గణేష్ విగ్రహాలే ఉంటాయి. ఇండ్లల్లోనూ చాలామంది రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలే కొంటున్నారు. ఈ విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్ సాగర్‎తోపాటు సిటీలోని చెరువులన్నీ దెబ్బతింటున్నాయి. పర్యావరణ పరిరక్షణకి ప్రమాదం ఉన్నందున హెచ్ఎండీఏ గత కొన్నేళ్లుగా మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది.

అందులో భాగంగా ఈ ఏడాది జీహెచ్ఎంసీ పరిధిలోని 38 ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేసి... 70 వేల మట్టి గణపతులను ఉచితంగా అందించనుంది. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, కేబీఆర్ పార్క్, శిల్పారామం, సికింద్రాబాద్ గణేష్ టెంపుల్, పెద్దమ్మ గుడితోపాటు నగరంలోని ప్రధాన పార్కులు, కూడళ్లు, గేటెడ్ కమ్యూనిటీస్, వెల్ఫేర్ అసోసియేషన్, ప్రెస్ అకాడమీ దగ్గర పాయింట్లు పెట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేయనున్నారు.  మొదటి రోజున 16 కేంద్రాల్లో ఈ ప్రక్రియ మొదలుపెట్టినట్లు హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.

హెచ్ఎండీఏ దగ్గర 8 ఇంచుల పొడవున్న విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో విగ్రహాన్ని30 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. అందుకోసం దాదాపు 26 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది 55 వేల విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తే.. ఈ ఏడాది 70వేల విగ్రహాలు పంపిణి చేస్తామని అధికారులు అంటున్నారు. ప్రతి ఏటా విగ్రహాల సంఖ్యను పెంచుతున్నట్టు అధికారులు చెప్పారు. ఈ ఏడాది జనం నుంచి డిమాండ్ పెరిగినందున మరిన్ని విగ్రహాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాగా.. హెచ్ఎండీఏ అందిస్తున్న మట్టి గణపతులకు జనాల నుంచి కూడా మంచి ఆదరణ వస్తోంది. ఇప్పటికే 16 కేంద్రాల నుంచి 8వేల విగ్రహాలను జనం తీసుకెళ్లారని అధికారులు తెలిపారు.