శివసేనకు 21.. కాంగ్రెస్​కు 17

శివసేనకు 21.. కాంగ్రెస్​కు 17
  • మహారాష్ట్రలో పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి

ముంబై: మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లకు మహా వికాస్  అఘాడీ (ఎంవీఏ) కూటమి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా శివసేన (ఉద్ధవ్  బాల్ ఠాక్రే వర్గం) 21, కాంగ్రెస్ 17, ఎన్సీపీ (శరద్  పవార్  వర్గం) 10 సీట్లలో పోటీ చేయనున్నాయి. వివాదం నెలకొన్న సంగ్లి, భివండి స్థానాలను  శివసేన, ఎన్సీపీకి కాంగ్రెస్  వదులుకుంది. 

సంగ్లిలో శివసేన, భివండిలో ఎన్సీపీ పోటీ చేయనున్నాయి. సీట్ల ఒప్పందం చేసుకున్న తర్వాత ఎంవీఏ కూటమి నేతలు సౌత్  ముంబైలోని శివాలయంలో (శివసేన యూబీటీ ఆఫీసు) మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీది దోపిడీదారుల పార్టీ అని, అలాంటి పార్టీని ఓడించడమే తమ కూటమి లక్ష్యమని శివసేన (యూబీటీ) చీఫ్​ ఉద్ధవ్  ఠాక్రే అన్నారు. ఏకగ్రీవంగా సీట్ల ఒప్పందం కుదిరిందని ఆయన చెప్పారు. 

‘‘కొన్ని సీట్ల విషయంలో మొదట అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ, చివరకు అంతా సర్దుకుంది. మాది ఫేక్  శివసేన పార్టీ అని ప్రధాని మోదీ ఆరోపించారు. వాస్తవానికి బీజేపీదే దోపిడీదారుల పార్టీ. అలాంటి పార్టీకి నాయకుడైన ప్రధాని మమ్మల్ని ఫేక్  అని పిలుస్తున్నాడు” అని ఉద్ధవ్  అన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్  ప్రెసిడెంట్ నానా పటోలే మాట్లాడుతూ మోదీ, బీజేపీని ఓడించేందుకు వివాదాలు పక్కనపెట్టి సీట్ల సర్దుబాటు చేసుకున్నామన్నారు. ‘‘బీజేపీని ఓడించేందుకు మా కార్యకర్తలు పోరాడతారు. మన లీడర్లు సోనియా, రాహుల్​ను బీజేపీ ఎలా అవమానపరిచిందో వారు మరిచిపోరు. ఉద్ధవ్, శరద్  పవార్ కు చెందిన పార్టీలను రెబల్స్​తో హైజాక్  చేయించారు” అని పటోలే విమర్శించారు. ఏ సీటు మీద కూడా విభేదాలు లేవని ఎన్సీపీ చీఫ్​ శరద్ పవార్  తెలిపారు.

21 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన శివసేన

ఒప్పందంలో భాగంగా తమకు వచ్చిన 21 సీట్లకు శివసేన (యూబీటీ) చీఫ్​ ఉద్ధవ్  ఠాక్రే అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా త్వరలో వారి అభ్యర్థులను ప్రకటిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ఆయన ప్రశంసలు కురిపించారు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడితే హామీలను నెరవేరుస్తామని చెప్పారు. కాగా, మహారాష్ట్రలో ఈ నెల 19 నుంచి 20 వరకు 5 దశల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి.