- జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్
తూప్రాన్, వెలుగు: ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం అందించే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి ప్రతాప్ సింగ్ సూచించారు. శుక్రవారం తూప్రాన్ మండలం నర్సంపల్లి లో కూరగాయల సాగు పై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు వల్ల రైతులకు మంచి దిగుబడితో పాటు మంచి లాభాలు వస్తాయన్నారు.
ఉద్యాన శాఖ ద్వారా అందించే బిందు తుంపర సేద్య పరికరాలు, కూరగాయల నారు, రక్షిత సేద్యం, కూరగాయల పందిర్లు, ఫామ్ పాండ్, పండ్ల తోటలకు వచ్చే సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తూప్రాన్ మండలంలో 500 ఎకరాలలో కూరగాయల చేస్తున్నారన్నారు.
ఎక్కువ మొత్తంలో పురుగుమందుల వాడకం వల్ల కలుషితమైన కూరగాయల ఉత్పత్తి జరుగుతుందని రైతులందరూ ఉద్యాన అధికారుల సూచనలను పాటించి నాణ్యమైన కూరగాయలను పండించాలన్నారు. కార్యక్రమంలో నర్సంపల్లి సర్పంచ్ భాస్కర్, శాస్త్రవెత్తలు శ్రీనివాస్, రవి, అగ్రికల్చర్ ఆఫీసర్ గంగుమల్లు, రచన రైతులు పాల్గొన్నారు.
