- డీజేఎస్ ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ డిమాండ్
- గన్‌పార్క్ నుంచి మీడియా అకాడమీ వరకు నిరసన ర్యాలీ
హైదరాబాద్, వెలుగు: అర్హులైన డెస్క్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని వివిధ జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను రద్దుచేసి గతంలో ఇచ్చిన మాదిరిగానే జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం డెస్క్ జర్నలిస్టుల సంఘం (డీజేఎస్) ఆధ్వర్యంలో టీడబ్ల్యూజేఎఫ్, టీయూడబ్ల్యూజే(143), కేబుల్ నెట్‌వర్క్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా సంఘాల ప్రతినిధులు హైదరాబాద్‌లోని గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
డెస్క్ జర్నలిస్టులందరికీ న్యాయం జరగాలంటూ స్లోగన్స్ ఇచ్చారు. అనంతరం తెలంగాణ మీడియా అకాడమీ వరకు ర్యాలీ నిర్వహించారు. అకాడమీ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. మీడియా అకాడమీ సెక్రటరీకి వినతి పత్రం అందజేసి తమ డిమాండ్లు తెలియజేశారు. ఈ సందర్భంగా డెస్క్ జర్నలిస్టుల సంఘం ప్రెసిడెంట్ బాదిని ఉపేందర్ మాట్లాడుతూ.. జీవో 252 ప్రకారం అక్రెడిటేషన్ జారీ చేస్తే డెస్క్ జర్నలిస్టులు అన్యాయానికి గురవుతారని తెలిపారు.
జర్నలిస్టులకు అందించే అన్ని సంక్షేమ పథకాలకు అక్రెడిటేషన్‌ను ప్రామాణికంగా తీసుకున్న ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకు కార్డుల్లో కోత పెట్టడం అంటే వారికి సంక్షేమాన్ని దూరం చేయడమే అవుతుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇస్తున్న హెల్త్ కార్డులు అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో ఎడిషన్ సెంటర్‌లో నాలుగైదు జిల్లాల డెస్కులు ఉన్నాయని, వారందరికీ జిల్లాకు 4 చొప్పున ఎడిషన్ సెంటర్ల పరిధిలోనే అక్రెడిటేషన్ కార్డులు మంజూరు చేయాలన్నారు.
సర్క్యులేషన్‌తో లింక్ వద్దు: మామిడి సోమయ్య
అక్రెడిటేషన్ల సంఖ్యకు పత్రికల సర్కులేషన్‌కు లింకు పెట్టడం సరికాదని టీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షుడు మామిడి సోమయ్య అన్నారు. పత్రికల సర్క్యులేషన్ ఎంత ఉన్నప్పటికీ.. పనిచేసే జర్నలిస్టుల సంఖ్య తగ్గదు కనుక.. అక్రెడిటేషన్ జారీలో సర్క్యులేషన్ నిబంధనను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే(హెచ్143) ట్రెజరర్ యోగానంద్, డీజేఎస్ ప్రధాన కార్యదర్శి రాజారాం మాట్లాడారు.
నిరసన ర్యాలీలో డీజేఎస్ ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు పాల్గొన్నారు. నిరసన ర్యాలీలో డీజేఎస్ ప్రతినిధులు, డెస్క్ జర్నలిస్టులు టి. శ్రీనివాస్, రవి, వి.వెంకటరమణ, పెద్ది పద్మ, కాంకూరి వెంకటేశ్వర్లు, జనార్దన్, సదానందం, రాజశేఖర్ గౌడ్, రాజుతో పాటు కేబుల్, డిజిటల్ మీడియా ప్రతినిధులు, పలు సంఘాల జర్నలిస్టులు పాల్గొన్నారు.
