హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ పరిసరాల్లో మాజీమంత్రులు, సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిపై పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత హేయమని బీజేపీ ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా శాసనసభ్యులపై పోలీసుల దౌర్జన్యాన్ని, ప్రభుత్వ వైఖరిని ఖండించారు. అసెంబ్లీలో మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన ఈ దాడికి రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆమె ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలకే రక్షణ, గౌరవం లేకపోతే ఇక రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా శాసనసభ్యులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించేలా ఎవరు ఆదేశాలు ఇచ్చారని డీకే అరుణ ప్రశ్నించారు. సీఎం హోదాలోనా, లేక హోంమంత్రి హోదాలో ఈ ఆదేశాలు జారీ చేశారా అని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన ఇద్దరు సీనియర్ మహిళా నేతలకు ఈ రకమైన అవమానం జరుగుతుంటే కొంచమైనా సిగ్గు అనిపించడం లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
