కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నడు: డీకే అరుణ ఫైర్​

కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నడు: డీకే అరుణ ఫైర్​

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నాడని బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ ఫైర్ అయ్యారు. నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి రైతుల కోసం గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే అతన్ని పరామర్శించడానికి వెళ్తుండగా నిజామాబాద్​ జిల్లా ఇందల్వాయి వద్ద పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆమె హైదరాబాద్​తిరిగి వచ్చారు. అనంతరం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు.  పోలీసులు 144 సెక్షన్ ను అమలు చేస్తూ, ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటున్నారని అరుణ మండిపడ్డారు. 

రైతుల తరఫున మహేశ్వర్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షను చేస్తుంటే అడ్డుకున్నా రని, రైతులు ఆందోళన చేస్తుంటే కేసీఆర్ కు బాధ్యత లేదా? అని ఆమె  ప్రశ్నించా రు. తెలంగాణ కోసం ఉద్యమంలో కేసీఆర్ దొంగ దీక్ష చేశాడని అన్నారు. నిర్మల్ లో మాస్టర్ ప్లాన్ తో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, 220 జీవో రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భూదందా జరుగు తోందని, వేల ఎకరాల భూములను అమ్ముతూ, కేసీఆర్ కుటుంబం మిగతా భూములను దోచుకుంటోందన్నారు. ప్రభుత్వ భూములను తన బినామీలకు, కార్పొరేట్లకు అమ్ముతున్నాడన్నారు. కాళేశ్వరంపై దోచుకునుడు అయిపో యిందని, ఇపుడు ఆయన కుటుంబం భూముల మీద పడ్డదని విమర్శించారు.