- ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం లెండిజాలలో కట్నాన్ని నిషేధిస్తూ గ్రామస్తుల నిర్ణయం
జైనూర్, వెలుగు: పెళ్లిళ్లలో కట్నాలు, కానుకల పేరుతో కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం తగ్గించేందుకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని లెండిజాల గ్రామస్తులు నిర్ణయించారు. ఇకపై గ్రామంలో జరిగే పెళ్లిళ్లలో కట్నాలు, కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాన్ని పూర్తిగా నిషేధిస్తూ తీర్మానం చేశారు.
బుధవారం లెండిజాల రాయ్ సెంటర్‌లో సార్మేడి మెస్రం బాధిపటేల్, గ్రామ పెద్ద మెస్రం పాలక్ రావుపటేల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించగా గ్రామంలోని పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. పెళ్లిళ్లలో కట్నాలు, ఖరీదైన కానుకలు ఇవ్వడం వల్ల పేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, ఇకపై కట్నకానుకలు ఇవ్వకూడదు, తీసుకోకూడదని తీర్మానించారు.
గ్రామంలో ఏ కుటుంబంలో పెళ్లి జరిగినా ఊరంతా సహకరించాలని.. ప్రతి కుటుంబం రూ.400 చొప్పున చందా సేకరించి, పెళ్లి జరుపుకునే కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. ఈ ఏడాది గ్రామంలో మొదటి పెళ్లి జరగనున్న మెస్రం జైతు కుటుంబానికి చందాలు అందజేశారు.
