
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి డీఎల్ఎఫ్ రోడ్ మూతపడింది. రోడ్డు విస్తరణ పనుల కారణంగా డీఎల్ఎఫ్ రోడ్లో ఫుడ్ బిజినెస్కు బ్రేక్ పడింది. హైదరాబాద్‌లో నైట్ టైమ్ ఫుడ్‌కి గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ (DLF) ఫుడ్ స్ట్రీట్ ఫేమస్. నగరంలోని ఐటీ, ఇతర ఉద్యోగులకు రాత్రి వేళలో ఆహారానికి ఇది ఒక మంచి హాట్‌స్పాట్. 200కు పైగా స్టాళ్లతో దాదాపు కిలోమీటరు విస్తీర్ణంలో ఉన్న డీఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్‌లో టిఫిన్స్ నుంచి బిర్యానీ దాకా.. చాట్ నుంచి జూసుల వరకు అన్నీ దొరుకుతాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇక్కడ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు.
రాత్రి వేళలో డీఎల్ఎఫ్ ఫుడ్ స్ట్రీట్‌కు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో గచ్చిబౌలి పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఏర్పడుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గచ్చిబౌలిలో రోజురోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుండటంతో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారు. DLF ఫుడ్ స్ట్రీట్‌ను తొలగించబోతున్నట్లు ఇప్పటికే షాప్ యజమానులకు అధికారులు సమాచారం అందించారు. అధికారుల ఆదేశాల మేరకు వ్యాపారులు ఫుడ్ స్ట్రీట్ను ఖాళీ చేశారు.
అయితే.. ఈ తరలింపు ప్రణాళికలో భాగంగా డీఎల్ఎఫ్ స్ట్రీట్ ఫుడ్లోని దుకాణాలను ITC కోహేనూర్ రోడ్డు చివరన ఉన్న ఒక మైదానానికి తరలించడానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) సన్నాహాలు చేస్తోంది. వీధి వ్యాపారులకు నెలవారీ అద్దెలు, IDలతో నియమించబడిన స్థలాలు ఇవ్వబడతాయని అధికారులు తెలిపారు.