ప్రజలు, రైతులను కేంద్రం పట్టించుకోవట్లేదు

ప్రజలు, రైతులను కేంద్రం పట్టించుకోవట్లేదు

చెన్నై: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతలుకు డీఎంకే పార్టీ మద్దతు తెలిపింది. అన్నదాతలకు మద్దతుగా డీఎంకే నేతలు శుక్రవారం పూర్తి రోజు ఉపవాసం చేస్తున్నారు. ఈ సందర్భంగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ రైతులకు మద్దతుగా నిలిచిన వారిని దేశ వ్యతిరేకులుగా ప్రభుత్వం పేర్కొనడాన్ని ఖండించారు.

‘కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న వారిని దేశ వ్యతిరేకులని కేంద్ర ప్రభుత్వం అంటోంది. దీన్ని మేం ఖండిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు సరికాదు. రైతులకు వ్యతిరేకంగా కేంద్ర సర్కార్ మూడు చట్టాలను తీసుకొచ్చింది. అన్నదాతలు వరుసగా 23వ రోజు తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. అందుకే వారికి అండగా నిలవాలని మేం నిర్ణయించాం. ఇందులో భాగంగానే ఈ రోజు ఉపవాసంతో ఉంటూ మా నిరసనను తెలియజేస్తున్నాం. కేంద్రం ప్రజలు, రైతుల గురించి అస్సలు ఆలోచించట్లేదు. కరోనాను సాకుగా చూపి హడావుడిగా ఈ బిల్లులను ఆమోదించారు. కార్పొరేట్లకు సబ్సిడీలు ఇవ్వడం పైనే కేంద్రం దృష్టి పెడుతోంది. ప్రజలను పట్టించుకోవడం లేదు’ అని స్టాలిన్ పేర్కొన్నారు.