యాసంగిలో వరి వద్దు.. వేరే పంటలపై ఫోకస్ పెట్టండి

V6 Velugu Posted on Oct 26, 2021

భూపాలపల్లి అర్బన్, వెలుగు: రాబోయే యాసంగిలో వరికి బదులు ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయ పంటలు పండించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు. సోమవారం కలెక్టరేట్​లో ఆయన మీడియాతో మాట్లాడారు.  పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరించారు. ఎఫ్​సీఐ వరి ధాన్యం కొనుగోలుకు ముందుకురావడం లేదని ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సూచించిన పంటలు వేయాలన్నారు. అగ్రికల్చర్ యునివర్సిటీ సాయంతో రైతుల కోసం లాభదాయక పంటలను గుర్తించామన్నారు. మెట్ట పంటలైన వేరుశనగ, నువ్వులు, శనగ, మినుములు, బొబ్బర్లు, పెసర్లు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, కుసుమలు తదితర పంటలు వస్తే అధిక లాభాలు పొందవచ్చన్నారు. రైతులకు ఇబ్బందులు కలుగకుండా విత్తనాలు సైతం తామే పంపిణీ చేస్తామన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చే వారం నుంచి రైతు వేదికల్లో రైతులకు అవేర్ నెస్ కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏవో విజయ్ భాస్కర్, హర్టికల్చర్ ఆఫీసర్ అక్బర్, డీపీఆర్వో రవి కుమార్ తదితరులున్నారు.

పంట మార్పిడితో అధిక లాభాలు

ములుగు, వెలుగు: పంట మార్పిడితో అధిక లాభాలు పొందవచ్చని ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. సోమవారం ములుగు కలెక్టరేట్​లో డీఏవో గౌస్ హైదర్ ఆధ్వర్యంలో ఏఈవోలతో మీటింగ్ నిర్వహించారు. వరికి బదులు ఇతర పంటలు వేసేటట్లుగా రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతు వేదికల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి చైతన్యం తీసుకురావాలన్నారు. క్లస్టర్ల వారీగా మీటింగులు నిర్వహించాలన్నారు. ఏఏ పంటలు వేస్తున్నారో రైతుల నుంచి వివరాలు సేకరించాలన్నారు. కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్ శేఖర్ రెడ్డి, ఏడీఏలు, ఏవోలు ఉన్నారు.

వరి సాగు చేస్తే నష్టం..

వరంగల్ సిటీ, వెలుగు: వరి ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్ సీఐ విముఖత చూపుతున్న నేపథ్యంలో వరి సాగు చేస్తే రైతులు నష్టపోయే చాన్స్ ఉందని వరంగల్ జిల్లా కలెక్టర్ గోపి చెప్పారు. సోమవారం కలెక్టరేట్​లో అగ్రికల్చర్ ఆఫీసర్లు, విత్తనాల డీలర్స్ లతో మీటింగ్ నిర్వహించారు. వరికి బదులు ఆరు తడి, పప్పు ధాన్యాల పంటలు వేస్తే లాభాలు పొందవచ్చన్నారు. శనగలు, వేరుసెనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు, ఆముదాలు, కూరగాయలు లాంటివి పండించాలన్నారు. క్షేత్రస్థాయిలో ఆఫీసర్లు రైతులకు అవేర్ నెస్ కల్పించాలన్నారు. గిరి వికాసం ద్వారా ఐదెకరాల లోపు ఉన్న గిరిజన రైతులకు ప్రభుత్వమే సబ్సిడీ ఇచ్చి బోరు వేయిస్తుందన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 39 రేషన్ షాపులను వెంటనే భర్తీ చేయాలని సివిల్​సప్లై ఆఫీసర్ లక్ష్మి భవానిని ఆదేశించారు. విజిలెన్స్ కమిటీ ఆఫీసర్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అగ్రికల్చర్ జేడీ ఉషాదయాల్, హర్టికల్చర్ డీడీ శ్రీనివాస్, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ఆర్ఎం రఘు తదితరులున్నారు.

ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలి

జనగామ, వెలుగు: యాసంగిలో వరి ధాన్యాన్ని ఎఫ్ సీఐ కొనుగోలు చేయడం లేదని.. అందుకోసం వరికి బదులు ఇతర పంటలు సాగు చేసుకోవాలని కలెక్టర్ శివలింగయ్య సూచించారు. ఈమేరకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సోమవారం కలెక్టరేట్​లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఏఏవోలతో రివ్యూ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఏఈవోలు గ్రామాల్లోని పంటల సాగు పై పక్కా ప్రణాళికను తయారు చేయాలన్నారు. భూముల లక్షణాలకు అనుగుణంగా పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 26 నుంచి 29 వరకు అన్ని గ్రామాల్లోని రైతువేదికల్లో మీటింగులు నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, జనగామ ఆర్డీవో మధు మోహన్, డీఏవో రాధిక, శాస్త్రవేత్తలు ఉన్నారు.

Tagged Warangal, Telangana, crops, jayashankar bhoopalapalli, Yasangi, Cultivation, collector, mulugu, paddy, rabi season, rice,

Latest Videos

Subscribe Now

More News