- మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచన
- హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో ‘యువభారత్ రన్ 2026’
హైదరాబాద్, వెలుగు : ‘యువత పాశ్చాత్య ఆహారపు అలవాట్లను పక్కనపెట్టి, శారీరక దృఢత్వంపై దృష్టి సారించాలి, పిజ్జాలు, బర్గర్లు బంద్ చేసి రాగులు, సజ్జలు, జొన్నల వంటి పోషకాహారం తీసుకోవాలి’ అని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన ‘యువ భారత్ రన్ -2026’ కార్యక్రమాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలు భావితరాలకు అందాలంటే యువత ఆరోగ్యంగా ఉండాలన్నారు. ‘మనం శాంతినే కోరుకుంటాం.. కానీ ఎవరైనా మన జోలికి వస్తే ఎలా చెలరేగుతామో ఆపరేషన్ సింధూర్ వంటి ఘటనలతో నిరూపించాం’ అని చెప్పారు. అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ యుద్ధం అనాలోచితమని, ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు.
‘యోగా ఫర్ మోదీ కాదు.. యోగా ఫర్ బాడీ’ అని చెప్పారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాట్లాడుతూ... ఫిట్ ఇండియా లక్ష్యాన్ని సాధించాలంటే యువత ఫిట్‌గా ఉండాలని, 2047 వికసిత్ భారత్ సాధనలో వారి పాత్రే కీలకమని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో యువత భాగస్వామ్యం అవసరమన్నారు.
అనంతరం సినీనటుడు శర్వానంద్ తన సినిమా ‘బైకర్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీలు మల్క కొమురయ్య, అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, పల్లవి విద్యాసంస్థల సీఈఈఓ మల్క యశస్వీ పాల్గొన్నారు
