
-
బ్యాంకర్లపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తప్పవు
-
18 వేల కోట్లు రిలీజ్ చేస్తే.. రైతుకు చేరింది 7,500 కోట్లే
-
రైతులకు వీలైనంత త్వరగా తిరిగి రుణాలివ్వాలి
-
బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్: రుణమాఫీ ఆలస్యమైతే ఫలితం ఉండదని, బ్యాంకర్లు తమ సేవలను వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్ లో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే రైతులకు ఇప్పటి వరకు చేరింది 7,500 కోట్లు మాత్రమేనని అన్నారు. రుణాలు మాఫీ అయిన రైతులకు వీలైనంత త్వరగా లోన్లు ఇవ్వాలని అన్నారు.
దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని అన్నారు. ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉండేలా తమ ప్రభుత్వం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. బ్యాంకర్లు పూర్తిగా సహకరించాలని కోరారు. లెక్కలు కాదని, ఆత్మతో పనిచేయాలని సూచించారు. వ్యవసాయం తో పాటు పారిశ్రామిక రంగానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు.
సూక్ష్మ, మధ్యతరహ పరిశ్రమల ద్వారా పెద్ద సంఖ్యలో ఉపాధి కలుగుతుంది. వారికి విరివిగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు రూపంలో ఇవ్వనున్నామని అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ లో ప్రాధాన్యతా రంగాల అడ్వాన్సుల విషయంలో వివిధ విభాగాల్లో బ్యాంకులు సానుకూల పనితీరును కనబరిచినందుకు సంతోషిస్తున్నట్టు చెప్పారు. తొలి క్వార్టర్ లోనే ప్రాథమిక రంగం కింద బ్యాంకులో ఇప్పటివరకు 40.62% వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యాన్ని సాధించడం అభినందనీయమని చెప్పారు. రాష్ట్రం నగదు నిల్వలనిష్పత్తి మొదటి క్వార్టర్లో 127. 29 శాతానికి మెరుగుపడడం ఆసక్తికరమైన అంశమని అన్నారు.