మమ్మల్ని 420 అంటరా.. మీపై 840 చట్టం తేవాలె.. కేటీఆర్, హరీశ్​పై జగ్గారెడ్డి ఫైర్

మమ్మల్ని 420 అంటరా.. మీపై 840 చట్టం తేవాలె.. కేటీఆర్, హరీశ్​పై జగ్గారెడ్డి ఫైర్
  • మీ చీటింగ్​లకు లెక్క లేదు.. లెక్కలన్నీ తేల్చి మిమ్మల్ని లోపలేయాలె
  • రేవంత్​ బాగా పనిచేస్తున్నరు
  • హామీలన్నీ అమలు చేస్తున్నం..ఫ్రీ బస్ ​జర్నీ స్కీమ్​ సక్సెస్​ అని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ను 420 అని అనడానికి కేటీఆర్, హరీశ్​కు ఎంత ధైర్యం అని పీసీసీ వర్కింగ్​ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. అసలు 420 ఎవరో ప్రజలకు తెలుసని, వారిపై 420 కాదు.. 840 అనే చట్టాన్ని తేవాలన్నారు. వాళ్ల లెక్కలన్నీ తేల్చి లోపలేయాలని చెప్పారు. దీనిపై ప్రధానిని డిమాండ్​ చేయాలని, ఆయన ఆ చట్టాన్ని తేకుంటే ప్రధానినీ ఆ చట్టంలో చేర్చాలని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు.  ‘‘కేటీఆర్, హరీశ్.. మా కాంగ్రెస్​పార్టీని 420 అంటారా? అసలు 420 మీరు. రాష్ట్రానికి తొలి సీఎం దళితుడిని చేస్తానని మోసం చేయలేదా? దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తమని ఇయ్యలేదు. పేపర్ లీక్ చేసి నిరుద్యోగుల జీవితంతో ఆడుకున్నరు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామని మోసం చేశారు. మద్దతు ధర అడిగిన రైతులకు సంకెళ్లు వేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నష్టపోయిన రైతులు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీ మీద ఎన్ని చీటింగ్​కేసులు పెట్టాలి? మీపై కోర్టులో కేసు వేస్తే వాటన్నింటికి జవాబులు చెప్తరా? కాంగ్రెస్​పార్టీ తరఫున కోర్టులో కేసు వేస్తాం’’ అని ఆయన తెలిపారు.

బస్సుల్లో తిరిగితే కదా తెలిసేది..

బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మహిళలు, విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. కేటీఆర్, హరీశ్​లు బస్సెక్కరు కాబట్టి వారికి మహిళల సంతోషం తెలియదని చెప్పారు. ‘‘ప్రభుత్వం వచ్చినా నేను బయట ఉన్నా కాబట్టి ఏమీ అనలేకపోతున్నా. నేను లోపల ఉండుంటే వారిని ఓ ఆట ఆడుకునే వాడిని. సోనియా, కాంగ్రెస్ తెలంగాణ ఇయ్యకుంటే వచ్చేదా? రాష్ట్రం వచ్చాక సోనియా ఇంటికి మొదట మీరే పోయారు. మీరు, మీ ఫ్యామిలీ ఎందుకు సోనియా దగ్గరకు వెళ్లి ఆమె కాళ్లు మొక్కారు. మీ డ్రామాలు బంజేయాలి. పదేండ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు’’ అని పేర్కొన్నారు.  

రాష్ట్రంలో ప్రజా పాలన..

తొమ్మిదేండ్లు కేసీఆర్ పాలన అని అన్నారని, కానీ, రేవంత్ సీఎం అయ్యాక రేవంత్ పాలన అని కాకుండా ప్రజాపాలన అంటున్నారని జగ్గారెడ్డి చెప్పారు. పరిపాలనను రేవంత్​ పరుగులు పెట్టిస్తున్నారని తెలిపారు.  ‘‘మా మంత్రులకు రాత్రి ఇంటికి పొయ్యే టైమ్ కూడా లేదు. సచివాలయంలో కష్టపడి పని చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే పిల్లర్లు కుంగిపోయాయి. రైతుబంధు, రుణమాఫీపై మాట్లాడే ముందు మీవి నోర్లో.. మోరీలో చూసుకోవాలి. కేసీఆర్ ఆరు లక్షల కోట్ల అప్పులు చేశావు.. దాని వడ్డీలు ఎక్కడి నుంచి కట్టాలి. కేటీఆర్, కవిత, హరీశ్‌‌లకు అప్పులు లేవు.. వాళ్లు సేఫ్.. వేరే దేశం వెళ్లైనా బతుకుతారు. మాజీ మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో మస్తు మాట్లాడుతున్నాడు. మామ ఏడ సంతకం పెట్టమంటే అక్కడ పెడ్తివి.. బామ్మర్ది ఏడ గుంజమంటే ఆడ గుంజితివి’’ అని జగ్గారెడ్డి విమర్శించారు. జగ్గారెడ్డి పేరే ఓ బ్రాండ్​ అని, పదవులతో తనకు బ్రాండ్​రాలేదని తెలిపారు. పార్టీ తనకు చాలా అవకాశాలిచ్చిందని, ఎమ్మెల్సీ రేసులో చాలా మంది టికెట్లు త్యాగం చేసిన నేతలున్నారని చెప్పారు.