పత్తి రైతులను దోచుకుంటున్నా పట్టించుకోరా?

పత్తి రైతులను దోచుకుంటున్నా పట్టించుకోరా?
  • రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న
  • సీడ్ కంపెనీలు రైతులను మోసం చేస్తున్నయి
  • ఏం చర్యలుతీసుకున్నరో చెప్పాలని ఆదేశం

హైదరాబాద్,వెలుగు: విత్తన కంపెనీలు పత్తి రైతుల్ని దోపిడీ చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. ఆరుగాలం కష్టపడే రైతులను కంపెనీలు నమ్మించి మోసం చేస్తుంటే చర్యలు తీసుకోకపోతే ఎలాగని నిలదీసింది. సీడ్ కంపెనీల మోసాల నుంచి రైతులను రక్షిం చేందుకు ఎలాంటి చట్టాలను అమలు చేస్తున్నారో తెలియజేయాలని ఆదేశించింది. తెలంగాణ మార్కెట్‌ చట్టం గురించిన వివరాలు అందజేయాలని శుక్రవా రం జస్టి స్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టి స్‌ బి.విజయ్‌సేన్‌రె డ్డిలతో కూడిన డివిజన్‌బెంచ్‌ నోటీసు జారీ చేసింది.

రైతుల రక్షణకోసం చట్టం చేయలే

పత్తి రైతులను విత్తన కంపెనీలు, దళారులు మోసం చేస్తున్నారంటూ గద్వాల జోగుళాంబ జిల్లాకు చెందిన నడిగడ్డ రైతు హక్కుల పోరాట సమితి చైర్మన్‌ జి.రంజిత్‌కుమార్‌ పిల్‌వేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు నూజివీడు, కావేరి, కోహినూర్, రాశి విత్తన కంపెనీలతో పాటు జిల్లా సీడ్‌మెన్‌ అసో సియేషన్లను ప్రతివాదులుగా చేశారు. రైతుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల ధరల భరోసా పేరిట ఆర్డినెన్స్‌ ఇచ్చిందని, అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని రూపొందించలేదని పిటిషనర్‌ తరఫు న్యాయవాది అర్జున్‌ కుమార్‌ తెలిపారు. సాగుకు పెట్టుబడులు ఇచ్చి విత్తన కంపెనీల దళారులు రైతులను దోచుకుంటున్నారని, ప్రామిసరీ నోట్లు రాయించుకుని దగా చేస్తున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం సమయం కావాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోరారు. దీంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.

అమీన్ పూర్ చెరువులో ఆక్రమణలను తొలగించండి

అమీన్ పూర్ చెరువులో ఆక్రమణలను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకోసం యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించింది. ఆక్రమణలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ గా గుర్తింపు పొందిన అమీన్ పూర్ లేక్ ఆక్రమణలకు గురవుతోందని హైదరాబాద్‌ బర్డింగ్‌ పాల్స్‌ ఎన్జీవో  ఫైల్ చేసిన పిల్ పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. చెరువు ఎఫ్ టీఎల్ ఖరారుకు ఏడాది క్రితమే నోటిఫికేషన్‌ ఇచ్చినా, ఇప్పటి వరకు పురోగతి లేదని పిటిషనర్ తరఫు లాయర్ హైకోర్టుకు తెలిపారు.