300 ఏండ్ల క్రితం పోస్ట్ చేసిన లెటర్ ఎలా చదివారో తెలుసా?

300 ఏండ్ల క్రితం పోస్ట్ చేసిన లెటర్ ఎలా చదివారో తెలుసా?

లెటర్‌ని భద్రంగా ఎన్వలప్‌లో పెట్టి పోస్ట్ చేసే రోజులు కావవి. లోపల రాసిన విషయం తెలియకుండా ట్రెడిషనల్ టెక్నిక్స్ వాడి ఈజీగా ఓపెన్ చేయడానికి వీలుకాని విధంగా మడిచి ‘లెటర్ లాకింగ్’ చేసేవాళ్లు. ఇలా లాక్ చేసి 17వ శతాబ్దంలో పోస్ట్ చేసిన లెటర్ ఏవో కారణాల వల్ల చేరాల్సిన వాళ్లకు చేరలేదు. ఇలాంటి చాలా లెటర్లు డచ్ పోస్టల్ మ్యూజియంలో ఒక బాక్స్ నిండా ఉన్నాయి. దాదాపు 300 ఏండ్లకు పైగా ఓపెన్ చేయకుండా ఉన్న ఈ లెటర్లలో ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో మ్యూజియం అధికారులు సైంటిఫిక్ పద్ధతులపై నజర్ వేశారు.

ఒక సంవత్సరం రోజులు తెరవకుండా పెట్టిన పుస్తకాన్ని సడన్గా ఓపెన్ చేస్తేనే పేజీలు అతుక్కుపోయి, లోపలి అక్షరాలు చెరిగిపోతాయి. అలాంటిది 300 ఏండ్లకు పైగా పక్కనపడేసిన లెటర్స్ తెరిచి చదవడమంటే మామూలు విషయం కాదు. ఈ పని ఏ పొరబాటూ జరగకుండా పూర్తి చేస్తామని లండన్లోని క్వీన్ మేరీ యూనివర్సిటీ ముందుకొచ్చింది. పంటి లోపల భాగంలో ఉండే మినరల్స్ గురించి తెలుసుకోవడానికి డెవలప్ చేసిన ఎక్స్రే స్కానర్ సాయంతో ఇటీవలే ఒక లెటర్ను డిజిటల్గా ఓపెన్ చేసి చదివారు.1697 జూలై 31న జాక్వెస్ సెన్నాక్వెస్ అనే వ్యక్తి ది హేగ్లో ఉన్న తన కజిన్కు రాసిన లెటర్ అది. అందులో డెత్ నోటీస్కు సంబంధించిన విషయం రాసి ఉందని రీసెర్చర్స్ తెలిపారు. డెంటల్ రీసెర్చ్ ల్యాబ్స్లో వాడేందుకు యూనివర్సిటీలో డెవలప్ చేసిన ఎక్స్రే మైక్రోటోమోగ్రఫీ స్కానర్ సాయంతో ఆ పేపర్ను ఫిజికల్గా ఓపెన్ చేయకుండా లోపలి మేటర్ను స్క్రీన్పై డిస్ప్లే చేయగలిగామని ప్రొఫెసర్ గ్రాహం డెవిస్ తెలిపారు. హిస్టరీ, ఆర్కియాలజీ, హెరిటేజ్ డాక్యుమెంట్స్ ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా చదివేందుకు ఈ టెక్నిక్ ఉపయోగపడుతుందని చెప్పారు

లెటర్ లాకింగ్ అంటే..
ఇప్పుడంటే ఏదైనా డాక్యుమెంట్ లేదా లెటర్ పోస్ట్ చేయాల్సి వచ్చినా ఎన్వలప్ కవర్లో పెట్టి పంపుతున్నాం. ఆ డాక్యుమెంట్, లెటర్లోని విషయం బయటకు తెలియకుండా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నాం. వందల ఏండ్ల క్రితం ఒక వైట్ పేపర్ మీద దానినే ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉపయోగించి ఎన్వలప్లా లాక్ చేసేవాళ్లు. పిల్లలు కాగితం పడవలు చేసినట్లుగా పేపర్కు మధ్యలో చిన్న కోతలు పెట్టి, మడిచే వాళ్లు. కొన్ని ప్రాంతాల్లో వాళ్లు పేపర్పై రంధ్రాలు చేసి, ఒక రకమైన పద్ధతిలో మడిచి కట్టేసి పోస్ట్ చేసేవాళ్లు. ఉపయోగించే టెక్నిక్ను బట్టి లెటర్ లాకింగ్, లెటర్ బైండింగ్ అనే పేర్లు వచ్చాయి. 13వ శతాబ్దం నుంచి ఈ పద్ధతులను పాటించేవాళ్లని పురాతన డాక్యుమెంట్ల కార్బన్ డేటింగ్ ద్వారా సైంటిస్టులు తేల్చారు. ఈ లెటర్ లాకింగ్, బైండింగ్ అనే పేర్లు ఆయా లెటర్లు ఉన్న తీరును బట్టి 2009లోనే పెట్టారట. పురాతన కాలంలో వీటిని ఏ పేరుతో పిలిచేవారో కూడా తెలియదు.