రేషన్ కార్డు కావాలా..? వెంటనే దరఖాస్తు చేసుకోండి

రేషన్ కార్డు కావాలా..? వెంటనే దరఖాస్తు చేసుకోండి
  • రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశం

హైదరాబాద్: తెలంగాణలో నిరుపేదలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొత్త రేషన్ కార్డుల జారీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది. అయితే దరఖాస్తు చేసుకోకుండా మిగిలిపోయిన వారికి ఎలా జారీ చేయాలి.. ఎప్పటి నుంచి కొత్తవారు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలనే విధి విధానాలు రూపొందించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాత్రి పొద్దుపోయేలోపు లేదా రేపు ఉదయం కంతా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

రేషన్ డీలర్ల డిమాండ్లపై కేబినెట్ సబ్ కమిటీ నియామకం
రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.