స్కీమ్​ల బీఆర్ఎస్ కావాల్నా.. స్కామ్​ల కాంగ్రెస్ కావాల్నా? : కేటీఆర్

స్కీమ్​ల బీఆర్ఎస్ కావాల్నా.. స్కామ్​ల కాంగ్రెస్ కావాల్నా? : కేటీఆర్
  • జనం తేల్చుకునే సమయం వచ్చింది: కేటీఆర్
  • పోటీ సమ ఉజ్జీలతోనే కానీ.. మరుగుజ్జులతో కాదని కామెంట్
  • రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో పర్యటించిన మంత్రి
  • రావిర్యాలలో మెగా విజయ డెయిరీ ప్లాంట్ ప్రారంభం

షాద్ నగర్/వికారాబాద్: కాంతులు తెచ్చే బీఆర్ఎస్ కావాలో? కాల్చుకు తినే కాంగ్రెస్ కావాల్నో తెలంగాణ జనం తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. ఉదయం10 గంటలకు షాద్​నగర్​కు చేరుకున్న కేటీఆర్.. 1,760 డబుల్ బెడ్​రూమ్​ఇండ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్కీమ్​లు తెచ్చే బీఆర్ఎస్ కావాల్నో.. స్కామ్​లు చేసే కాంగ్రెస్ పార్టీ కావాల్నో జనమే తేల్చుకోవాలన్నారు. రూపాయి ఖర్చు లేకుండా రూ.25 లక్షలు విలువ చేసే ఇండ్లను నిరుపేదలకు పంచుతున్నామన్నారు. తొమ్మిదేళ్లలో తెలంగాణ బాగుపడిందా.. పాడైందా అన్నది జనం గుర్తించాలన్నారు. ఎన్నికల ముందు వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలకు చేసే మేలు ఏమీ ఉండదన్నారు. ‘‘కాంగ్రెస్​కు ఓటేస్తే 3 గంటల కరెంట్​తో వ్యవసాయం ఆగమవుతుంది. చచ్చిన పీనుగలా మారిన కాంగ్రెస్​ పార్టీది దింపుడు కళ్లెం ఆశ.  అధికారంలో ఉన్నప్పుడు రూ.200 కంటే ఎక్కువ పెన్షన్ ఇవ్వని కాంగ్రెస్.. ఇప్పుడు రూ.4 వేలు ఇస్తామంటే ఎలా నమ్మాలి? కాంగ్రెస్ ఆరు గ్యారంటీల స్కీమ్​లను నమ్మి మోసపోవద్దు. తొందర్లోనే కేసీఆర్ భారీ స్కీమ్​లు ప్రకటించబోతున్నారు’’ అని అన్నారు. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్​పై ఆందోళన అవసరం లేదని.. ప్రస్తుతం కొల్లాపూర్, ఉదండాపూర్, కరివెన, ఏదుల, లక్నాపూర్ పనులు పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయన్నారు. రేవంత్ రెడ్డి లాంటి ఆర్ఎస్ఎస్ నాయకుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని కాంగ్రెస్  నేత అమరేందర్ సింగ్ స్వయంగా చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ ఆసక్తిగా ఉందంటూ మోదీ చెప్పడం చూస్తే నవ్వొస్తోందని.. ఆ పార్టీతో కలిసి ఉండే దరిద్రం బీఆర్ఎస్​కు పట్టలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, నేతలు పాల్గొన్నారు.

వికారాబాద్​లో ఐటీ హబ్​కు కృషి..

తెలంగాణ వచ్చాక వికారాబాద్ జిల్లా ఏర్పాటైందని.. మెడికల్ కాలేజీ కూడా వచ్చిందని మంత్రి కేటీఆర్ అన్నారు. వికారాబాద్​లో మంత్రి రూ.60 కోట్లతో బ్రిడ్జి పనులకు స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం గిరిజన భవనాన్ని ప్రారంభించారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు. రూ. 2,700 కోట్లతో వికారాబాద్​లో అభివృద్ధి జరిగిందన్నారు. ‘ఎన్నికల ముందు సంక్రాంతి గంగిరెద్దుల లాగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు వస్తారు.. వారి మాటలకు ఆగం కాకండి. 24 గంటల కరెంట్ ఏడున్నదని కాంగ్రెస్ ఎంపీ వెంకట్ రెడ్డి అంటున్నాడు. వికారాబాద్​కు వచ్చి కరెంట్ తీగలు పట్టుకోండి. కాంగ్రెస్​ను11 సార్లు గెలిపించారు. అప్పుడు ఏమి చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఒక్క చాన్స్ అంటున్నారు. మా పోటీ సమ ఉజ్జీలతోనే.. రాజకీయ మరుగుజ్జులతో కాదు. 30 వేల మెజారిటీతో మెతుకు ఆనంద్ ను వికారాబాద్​లో గెలిపించాలి’ అని కేటీఆర్ పేర్కొన్నారు. ‘పాలమూరు – రంగారెడ్డి నీరు వస్తుంటే మన గుండెలు పొంగలేదా.. కాంగ్రెస్, బీజేపీకి హై కమాండ్ ఢిల్లీలో ఉంటది. ఏదైనా అక్కడికి వెళ్లాలి. మొనగాడు లాంటి కేసీఆర్ ఉండగా ఓట్లు కొనుక్కునే ఢిల్లీ గులాంలు మనకు అవసరమా’ అని కేటీఆర్ ప్రశ్నించారు. నాలుగు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుందని పేర్కొన్నారు.

రావిర్యాలలో మెగా విజయ డెయిరీ ప్లాంట్ ప్రారంభం

మహేశ్వరం, వెలుగు: గత ప్రభుత్వాలు పాడి పరిశ్రమను నిర్వీర్యం చేశాయని కేటీఆర్ మండిపడ్డారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలో కేటీఆర్.. రూ. 246.26 కోట్లతో పూర్తిస్థాయి ఆటోమేటిక్ టెక్నాలజీతో నిర్మించిన మెగా డెయిరీ విజయ ప్లాంట్​ను మంత్రులు తలసాని శ్రీనివాస్, సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డ్ సహకారంతో తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్​కు చెందిన 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ నిర్మించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సర్కారు రూపాడి రైతులకు .4 ఎక్కువ ఇచ్చి ఆదుకుంటోందన్నారు. రైతు ఆదాయం పెరగాలంటే ఐదు రకాల విప్లవాలు మన రాష్ట్రంలో రైతుల కోసం చేపట్టడంతో సాక్షాత్కారం అవుతున్నాయన్నారు. విజయ డెయిరీ నష్టాల్లో ఉంటే ఆదుకున్నామన్నారు. రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో విజయ డెయిరీ లాభాల బాట పట్టిందన్నరు.

ఆశ కార్యకర్తల ఆందోళన

 షాద్ నగర్ లో కేటీఆర్​బహిరంగ సభ జరుగుతున్న సమయంలో ఆశా వర్కర్లు మధ్యలో లేచి ఆందోళన చేపట్టారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆశా వర్కర్లకు ఏ రాష్ట్రంలో ఇవ్వనంతగా వేతనాలు ఇస్తున్నామని, భవిష్యత్తులోనూ వారికి తప్పకుండా వేతనాలు పెంచుతామన్నారు. సభ ముగిసిన తర్వాత ఆశా వర్కర్లు పత్తి మార్కెట్ ముందు పాత జాతీయ రహదారిపై ఆందోళన చేశారు. మంత్రి కేటీఆర్ ప్రసంగం పూర్తయ్యేవరకు ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు.