ఆరు కిలో మీటర్లు డోలీ మోసిన డాక్టర్

ఆరు కిలో మీటర్లు డోలీ మోసిన డాక్టర్

గిరిజన మహిళ, అప్పుడే పుట్టిన ఇద్దరు కవలల ప్రాణాలు కాపాడేందుకు మంచాన్ని డోలీలా మార్చి ఆరు కి.మీ. మోసుకెళ్లిన డాక్టర్​ ఉదంతం ఇది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని ఉల్వనూరు పీహెచ్​సీ డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో బుధవారం రాళ్లచెలుక గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. అంతకు గంట ముందు గ్రామంలోని  మాడివి సుక్య ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయం తెలియడంతో డాక్టర్​రాంబాబు చూడడానికి వెళ్లారు. కవలల్లో ఒకరు రెండు కిలోలు, మరొకరు 1.75 కిలోల బరువు ఉన్నారు. చిన్నారుల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుండటం, మరోవైపు అప్పటికే తల్లికి తీవ్ర రక్తస్రావం కావడంతో వారిని వెంటనే భద్రాచలం ఏరియా హాస్పిటల్​కు తరలించాలని సూచించారు. గిరిజన గ్రామం లోపలకు వాహనాలు రావడానికి వాగులు, వంకలు అడ్డం ఉండటంతో వారిని మోసుకెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మంచాన్ని తిరగేసి డోలీలా మార్చి సుమారు ఆరు కి.మీ. దూరం మామిడి గూడెం రోడ్డు వరకు పేషెంట్ బంధువుల సహాయంతో డాక్టర్ మోసుకెళ్లారు. అక్కడి నుంచి 108లో భద్రాచలం ఏరియా హాస్పిటల్​కు తరలించారు.