డాక్టర్లను కాపాడలేకపోతే  ఆస్పత్రులను మూసేయండి

డాక్టర్లను కాపాడలేకపోతే  ఆస్పత్రులను మూసేయండి

 

తిరువనంతపురం:  కేరళలోని కొల్లాం జిల్లా కొట్టారక్కరలోని తాలూకా ఆస్పత్రిలో డాక్టర్ వందనా దాస్(23)ను ఓ పేషెంట్ హత్య చేసిన ఘటనపై గురువారం జరిగిన విచారణలో ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్ అయ్యింది. రాష్ట్ర పోలీసులు, ప్రభుత్వ వైఫల్యం వల్లే డాక్టర్ హత్య జరిగిందని అసహనం వ్యక్తం చేసింది.

డాక్టర్లకు రక్షణ కల్పించలేకపోతే ఆస్పత్రులన్నింటినీ మూసివేయాలని జస్టిస్ దేవన్ రామచంద్రన్, జస్టిస్ కౌసర్ ఎడప్పగత్‌‌లతో కూడిన బెంచ్ ఫైర్ అయ్యింది. డాక్టర్ వందన హత్యతో డాక్టర్లు, మెడికల్ స్టూడెంట్లు, వారి తల్లిదండ్రుల్లో భయం నెలకొందని తెలిపింది. జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటివి జరగవచ్చని గతంలోనే హెచ్చరించామని గుర్తుచేసింది. నిందితులను లేదా కస్టడీలో ఉన్న వ్యక్తులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి పాటించే ప్రొటోకాలే.. డాక్టర్ల వద్దకు లేదా ఆస్పత్రులకు తీసుకెళ్లడానికి కూడా వర్తింపజేస్తే ఇలాంటి ఘటనలు జరగవని అభిప్రాయపడింది. నిందితులను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అవసరమైన ప్రొటోకాల్‌‌లను వెంటనే రూపొందించాలని రాష్ట్ర పోలీసు శాఖను కోర్టు ఆదేశించింది.

రాష్ట్రంలో ఇంకొక డాక్టర్ లేదా హెల్త్‌‌కేర్ ప్రొఫెషనల్‌‌పై దాడి జరిగితే దానికి డీజీపీ బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.  కొనసాగుతున్న నిరసనలు డాక్టర్ వందన హత్యకు వ్యతిరేకంగా కేరళలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో ఆస్పత్రులు, హెల్త్ సిబ్బంది, డాక్టర్ల రక్షణ కోసం వందనా దాస్ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని డాక్టర్లంతా 24 గంటలుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రులను ప్రత్యేక జోన్‌‌లుగా ప్రకటించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లపై అధికారుల నుంచి కచ్చితమైన హామీ వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని డాక్టర్లు వెల్లడించారు.