- అందుబాటులో ఉండని డాక్టర్
- మెడిసిన్స్ ఇస్తున్న అటెండర్
- చిన్న సమస్య వచ్చినా బయట దవాఖానకే
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో ఉద్యోగుల కోసం ఉన్న హెల్త్ డిస్పెన్సరీ పేరుకే పరిమితమైంది. అధికారికంగా ఎంబీబీఎస్ డాక్టర్‌ను కేటాయించినప్పటికీ, ఆయన అందుబాటులో ఉండకపోవడంతో అటెండర్ మందులు ఇస్తున్నాడు. ఉదయం అటెండెన్స్ కోసమే డాక్టర్వచ్చి వెళ్తున్నారని, దీంతో చిన్న సమస్య వచ్చినా బయట దవాఖానలకు ఆశ్రయించాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎప్పుడు వెళ్లినా డాక్టర్ఇప్పుడే బయటకు వెళ్లాడని, లంచ్ కి వెళ్లారని మ్యానేజ్చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎప్పుడైనా ఉన్నారని తెలిసి వెళ్తే పేషెంట్లు పడుకునే బెడ్‌పై రెస్ట్ తీసుకుంటున్నారంటున్నారు.
బీపీ కూడా చెక్ చేయడు
జీహెచ్ఎంసీలోని చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ హెల్త్ సెంటర్ కొనసాగుతున్నది. గతంలో ఈ సెంటర్ చాలా ఉపయోగపడేది. ఇక్కడకు రోజూ వంద మందికిపైగా ఓపీ సేవలు పొందేవారు. హెడ్ ఆఫీసు స్టాఫ్ తో పాటు చుట్టుపక్కల పనిచేసే శానిటేషన్ వర్కర్లు ఇక్కడ వైద్యం చేయించుకునేవారు.
కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఏ సమస్యతో వచ్చిన ‘డాక్టర్ఇప్పుడే బయటకు వెళ్లాడు..తింటున్నాడు’ అన్న సమాధానం వినిపిస్తోంది. ఎప్పుడూ ఇలాగే ఉంటుందని తెలిసి రోజూ 20 మంది కూడా రావడంలేదు. వచ్చినవాళ్లు కూడా అటెండర్ దగ్గర మందులు తీసుకొని పోతున్నారు. కనీసం బీపీ, షుగర్ కూడా చెక్ చేయలేని దుస్థితి నెలకొంది. డాక్టర్‌కు రూ.లక్షకు పైనే జీతం ఇస్తున్నారని, తీసుకునే జీతానికైనా న్యాయం చేయాలని జీహెచ్ఎంసీ స్టాఫ్కోరుతున్నారు.
