- భగ్నం చేసిన అహ్మదాబాద్ ఏటీఎస్
- ముగ్గురు ఉగ్రవాదులు అరెస్ట్
- ‘రిసిన్’ అనే కెమికల్ పాయిజన్‌తో దాడికి ప్లాన్
- నిందితుల్లో ఒకరు డాక్టర్.. హైదరాబాద్ వాసిగా గుర్తింపు
- మిగిలిన ఇద్దరిది ఉత్తరప్రదేశ్
- తుపాకులు, మందుగుండు సామగ్రి స్వాధీనం
అహ్మదాబాద్: ఢిల్లీ, లక్నో, అహ్మదాబాద్‌తో పాటు దేశంలోని పలు కీలక సిటీలలో టెర్రర్ అటాక్స్ చేయాలన్న కుట్రను అహ్మదాబాద్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) భగ్నం చేసింది. ఈ క్రమంలో దాడులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ముగ్గురు అనుమానిత టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్నది. ఈ ముగ్గురికి ఐఎస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. ‘రిసిన్’ అనే అత్యంత ప్రమాదకరమైన రసాయన పూరిత విషాన్ని వీళ్లు తయారుచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను డాక్టర్ అహ్మద్ మోయినుద్దీన్ సయ్యద్, ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సోహెల్ మహ్మద్ సలీంగా గుర్తించారు. డాక్టర్ అహ్మద్ మోయినుద్దీన్ సయ్యద్.. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేశాడు. వీరి వద్ద నుంచి తుపాకులతో పాటు ‘రిసిన్’ అనే విషం తయారీలో ఉపయోగించే పదార్థాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
పాకిస్తాన్ బార్డర్ మీదుగా వెపన్స్
డాక్టర్ అహ్మద్ మోయినుద్దీన్.. ‘రిసిన్’ అనే విషాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించాడు. ఇతని హ్యాండ్లర్.. ఇరాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ అయిన ఖోరాసాన్ ప్రావిన్స్‌తో సంబంధం కలిగి ఉన్నట్లు గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలిపారు. డాక్టర్ సయ్యద్.. టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహించడానికి నిధులు సేకరించి.. కొత్త వ్యక్తులను రిక్రూట్ చేసుకోవాలని ప్రణాళిక వేసినట్లు గుర్తించారు. తమ హ్యాండ్లర్.. పాకిస్తాన్ బార్డర్ మీదుగా డ్రోన్ ద్వారా ఆయుధాలను పంపుతున్నాడని నిందితులు వెల్లడించారు. ముగ్గురు కలిసి భారీ ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు టిప్ అందడంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. డాక్టర్ సయ్యద్ హైదరాబాద్ కు చెందినవాడు. గుజరాత్ గాంధీనగర్‌లోని అడాలజ్కు సమీపంలో డాక్టర్ సయ్యద్ పట్టుబడ్డాడు. ఇతని వద్ద నుంచి 2 గ్లోక్ పిస్టల్స్, ఒక బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కార్ట్రిడ్జ్‌లు, 4 లీటర్ల కాస్టర్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోని కీలక ప్రాంతాల్లో రెక్కీ
చైనా నుంచి ఎంబీబీఎస్ డిగ్రీ పొందిన సయ్యద్.. కెమికల్ టెర్రర్ అటాక్కు ప్లాన్ చేశాడు. దీని కోసమే రిసిన్ అనే విషాన్ని తయారు చేస్తున్నాడు. రిసిన్ తయారీ గురించి నెట్లో సెర్చ్ చేశాడు. తయారీకి కావాల్సిన అన్ని పరికరాలు, ముడి పదార్థాలను కూడా సేకరించుకున్నాడు. కెమికల్ పాయిజన్ తయారీకి ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాడు. అరెస్టు అయిన ఈ ముగ్గురూ కలిసి లక్నో, ఢిల్లీ, అహ్మదాబాద్ నగరాల్లోని అనేక సున్నితమైన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు ఏటీఎస్ అధికారులు తెలిపారు. డాక్టర్ సయ్యద్ హ్యాండ్లర్ ను అబూ ఖదీజాగా గుర్తించారు. ఇతను అఫ్గానిస్తాన్‌కు చెందినవాడు. పాకిస్థాన్‌లోని పలువురితో కూడా టచ్‌లో ఉన్నాడు.
మిగిలిన ఇద్దరిపై ‘ఉపా’ కింద కేసు నమోదు
నిందితులపై ఉగ్రవాద నిరోధక చట్టం (ఉపా), భారతీయ న్యాయ సంహిత, ఆర్మ్స్ చట్టం కింద కేసులు నమోదు చేశారు. మిగిలిన ఇద్దరు ఆజాద్ సులేమాన్ షేక్, మహ్మద్ సోహెల్ మహ్మద్ సలీం యూపీవాసులు. వీరిని బనస్కంఠా జిల్లాలో అరెస్ట్ చేశారు. వీళ్లు రాజస్థాన్‌లోని హనుమాన్ గఢ్ నుంచి వెపన్స్ తీసుకొచ్చి డాక్టర్ సయ్యద్ కు అప్పగించారు.
కెమికల్ పాయిజన్ ‘రిసిన్’ అంటే ఏంటి?
‘రిసిన్’ అనేది ఆముదం గింజల నుంచి తీసిన అత్యంత భయంకరమైన పాయిజన్. ఇది ప్రోటీన్ సింథసిస్‌ను అడ్డుకుంటది. ఇది ప్రయోగిస్తే.. శరీరంలోని కణాలు చనిపోతాయి. 1 మిల్లీ గ్రామ్ రిసిన్.. ఒక వ్యక్తిని చంపగలదు. దీనికి ఎలాంటి వాసన, రుచి ఉండదు.
జమ్మూ కాశ్మీర్లో కార్డెన్ సెర్చ్
టెర్రరిస్ట్ యాక్టివిటీస్‌కు మద్దతు ఇచ్చే నెట్‌వర్క్‌ను ఛేదించడం, పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న టెర్రరిస్టుల బంధువులు, సహచరులు, ఓవర్ గ్రౌండ్ వర్కర్ల కార్యకలాపాలు అడ్డుకునేందుకు జమ్మూ కాశ్మీర్లో పోలీసులు, భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాశ్మీర్ వ్యాలీ, బుద్గాం, కులగాం, అనంతనాగ్, అవంతిపోరాం, రాంబన్, కిష్టవార్, దోడా, కథువా, రాజౌరి జిల్లాల్లో సెర్చ్ చేశారు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, రిక్రూట్‌మెంట్‌కు సహాయం చేయడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్న అనుమానితులపై ఇండ్లల్లో సోదాలు నిర్వహించారు. బుదగాంలో ఖాన్ సాహిబ్, బీర్వా ప్రాంతాల్లో జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్స్ ఆపరేటింగ్ ఫ్రమ్ పాకిస్తాన్ (జేకేఎన్వోపీ) కార్యకర్తలను లక్ష్యంగా తనిఖీలు జరిగాయి. అనంతనాగ్‌లో పాక్ ఆధారిత టెర్రరిస్టుల బంధువులు ఉన్నారు. వారి ఇండ్లల్లోనూ సోదాలు జరిగాయి. మొత్తం సెర్చ్ ఆపరేషన్‌లో కొన్ని డిజిటల్ డివైజ్‌లు, మందుగుండు సామగ్రిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
డాక్టర్ సయ్యద్ది హైదరాబాద్
గండిపేట, వెలుగు: దేశంలో ఉగ్రదాడులకు ప్లాన్ చేసిన ముగ్గురు టెర్రరిస్టులు అహ్మదాబాద్‌లో అరెస్ట్ అయ్యారు. వీరిలో ఒకరిని హైదరాబాద్ రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన 35 ఏండ్ల సయ్యద్ అహ్మద్ మోయినుద్దీన్ గా గుర్తించారు. ఉప్పర్‌పల్లి ఫోర్ట్‌వ్యూ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆదివారం మధ్యాహ్నం రాజేంద్రనగర్‌లోని అతని నివాసానికి వెళ్లి ఆరా తీశారు. ఇన్నేండ్లు తమ మధ్య నివాసం ఉన్న వ్యక్తి.. ఓ టెర్రరిస్ట్ అని తేలడంతో ఫోర్ట్ వ్యూ కాలనీ వాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
