గుండె లోపల బుల్లి కంప్యూటర్

గుండె లోపల బుల్లి కంప్యూటర్
  • అనుక్షణం కనిపెట్టుకుని ఉండే ‘వీ ల్యాప్​’
  • ఎప్పటికప్పుడు డాక్టర్లకు గుండె డేటా
  • తయారు చేసిన ఇజ్రాయెల్​ కంపెనీ

ఒంటిపై ఎక్కడైనా దెబ్బ తగిలితే మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ట్రీట్​మెంట్​ చేయించుకుంటాం. మందులు వాడతాం. కానీ, మామూలుగా ఒంటి లోపల ఏం జరుగుతోందో తెలుసుకోవడం ఓ మనిషికి కష్టమే. లోపల గడబిడగా ఉన్నా, ఛాతి నొప్పి వచ్చినా జస్ట్​ ఆ లక్షణాలకు మాత్రమే ట్రీట్​మెంట్​ తీసుకోవాల్సిన పరిస్థితి. ఒక్కోసారి ఆ ఛాతి నొప్పే గుండె నొప్పి కూడా అయి ఉండొచ్చు. అది మనం గుర్తించలేకపోవచ్చు. మరి, దానిని గుర్తించేదెలా? ప్రత్యేకించి గుండె జబ్బులున్నోళ్లలో, ఆ గుండె పనితీరును అంచనా వేసేదెలా? దానికే ఇజ్రాయెల్​కు చెందిన వెక్టోరియస్​ మెడికల్​ టెక్నాలజీస్​ అనే సంస్థ, గుండెని అంటిపెట్టుకుని ఉండి, ఎప్పటికప్పుడు కంటికిరెప్పలా కాచుకుని ఉండే బుల్లి కంప్యూటర్​ డివైస్​ ‘వీ ల్యాప్​’ను తయారు చేసింది. తొలిసారిగా లండన్​లోని 71 ఏళ్ల పేషెంట్​కు హ్యామర్​స్మిత్​​ హాస్పిటల్​ డాక్టర్లు ఆ బుల్లి కంప్యూటర్​ను అమర్చారు.

ఉండేదెక్కడ.. పనిచేసేదెట్ల?

వీ ల్యాప్​ను డైరెక్ట్​గా గుండెలోనే పెట్టేస్తారు. వ్యక్తి రక్తనాళాల నుంచి ఓ చిన్న పైప్​తో వీల్యాప్​ను పంపి రెండు కర్ణిక (ఆట్రియం)ల మధ్య అమరుస్తారు. అక్కడ అది నెట్​లా తెరుచుకుంటుంది. అలా గుండెలోకి చేరిన వీ ల్యాప్​, గుండె వేగం, పనితీరును ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉంటుంది. గుండెలో రక్తపోటును (బీపీ) అంచనా వేస్తుంది. ఆ డేటాను ఏఐ (ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​) ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ డాక్టర్లకు సమాచారాన్ని పంపుతుంది. తద్వారా టైంకు ఏయే మందులు వాడాలో పేషెంట్​కు డాక్టర్​ చెప్పే అవకాశం ఉంటుంది. ప్రాణాపాయాలను తప్పించేందుకు వీలుంటుంది. దీనికి చార్జింగ్​ పెట్టేందుకు బ్యాటరీల అవసరమూ లేదు. దాని కోసం పవర్​ బెల్ట్​ను వీల్యాప్​తో పాటు ఇస్తారు. దాన్నుంచే గుండెలోపలున్న వీల్యాప్​ను డైరెక్ట్​గా చార్జ్​ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గుండె రోగులకు ఇది వరమని డాక్టర్లు చెబుతున్నారు.

వీల్యాప్​తో ముందే పసిగట్టొచ్చు

పేషెంట్ల గుండెల్లో జరిగే మార్పులను బయటి నుంచి పక్కాగా తెలుసుకోవడం కష్టమని, వీల్యాప్​తో ఆ బెడద తీరుతుందని హ్యామర్​స్మిత్​ హాస్పిటల్​ డాక్టర్​ జాచరీ వినెట్​ చెప్పారు. వీ ల్యాప్​తో గుండెలో జరిగే మార్పులను వెంటనే తెలుసుకుని మందులు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దీని వల్ల సింప్టమ్స్​ తగ్గి, హాస్పిటల్​లో చేరడం తగ్గుతుందన్నారు. బ్యాటరీ అవసరం లేకుండా డిజిటల్​గా డేటాను ట్రాన్స్​ఫర్​ చేసేలా వీల్యాప్​ ఉపయోగపడుతుందని వెక్టోరియస్​ ఓనర్ ​ఒరెన్​ గోల్డ్​ష్టీన్​ చెప్పారు.