‘ఆయుష్‌’ డాక్టర్లకు స్మార్ట్‌ ఫోన్లు: జియో ట్యాగింగ్‌పై వెనక్కి తగ్గని సర్కార్

‘ఆయుష్‌’ డాక్టర్లకు స్మార్ట్‌ ఫోన్లు: జియో ట్యాగింగ్‌పై వెనక్కి తగ్గని సర్కార్

ఆయుష్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్న మెడికల్‌ ఆఫీసర్ల నుంచి స్వీపర్ల వరకూ అందరికీ స్మార్ట్ ఫోన్లు, సిమ్‌ కార్డులు ఇవ్వాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. సొంత ఫోన్లలో జియో ట్యాగింగ్ అటెండెన్స్‌ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకునేందుకు డాక్టర్లు ఒప్పుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. సుమారు 2,500 ఫోన్లు అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కొందరు మాత్రమే ఓకే

ఆయుష్ డైరెక్టర్‌‌ అలుగు వర్షిణి రెండ్రోజుల క్రితం కొంతమంది మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. జియో ట్యాగింగ్ అటెండెన్స్‌ యాప్ ఉద్దేశం, పనితీరు, ఉపయోగాలను వివరించారు. నెల రోజుల్లో ప్రతి ఒక్కరికీ స్మార్మ్‌ ఫోన్‌, సిమ్‌ కార్డులు పంపిణీ చేస్తామని, అందుకు సహకరించాలని వారిని కోరారు. కొంతమంది మెడికల్‌ ఆఫీసర్లు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. కానీ మెజారిటీ డాక్టర్లు వ్యతిరేకించారు. ఏదేమైనా ముందుకే వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలతో, ఉన్నతాధికారులు జిల్లాలవారీగా సమావేశాలను కొనసాగిస్తున్నారు. ఉద్యోగుల వద్ద వేలి ముద్రలు, ఇతర వివరాలను సేకరిస్తున్నారు. యాప్ వినియోగంపై అవగాహన కోసం తొలుత సొంత ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలని, ప్రభుత్వ ఫోన్లు వచ్చిన తర్వాతే జియోట్యాగింగ్ అటెండెన్స్‌ ప్రారంభిస్తామని చెబుతున్నారు. బుధవారం నల్లగొండలో యాప్‌ ఇన్‌స్టాలేషన్ సమావేశం నిర్వహించగా, మెడికల్ ఆఫీసర్లు ఇతర సిబ్బంది వ్యతిరేకించారు.

సెప్టెంబర్ 20లోపు పంపిణీ

ప్రస్తుతం ఆయుష్‌ డిపార్ట్​మెంట్​లోని పలు విభాగాల్లో 2,500 మంది పని చేస్తున్నారు. వీళ్లందరికీ సెప్టెంబర్ 20 లోపు ఫోన్లు, సిమ్‌లు పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తొలుత సెప్టెంబర్‌‌ ఒకటో తేదీ నుంచే యాప్‌ అటెండెన్స్‌ ప్రారంభించాలని భావించినా, కొత్త ఫోన్ల కొనుగోలు నేపథ్యంలో అక్టోబర్‌‌కు వాయిదా వేసినట్టు తెలిసింది. మొబైల్‌ యాప్‌ చాలా పకడ్బందీగా రూపొందించినట్టు ఆయుష్ ఉన్నతాధికారులు చెప్పారు. సంబంధిత హాస్పిటల్‌కు వెళ్లి వేలి ముద్ర వేస్తే తప్ప అటెండెన్స్‌ నమోదు కాని విధంగా యాప్‌ రూపొందించామన్నారు. రోజుకు కనీసం 3 సార్లు యాప్‌లో వేలిముద్ర వేయాల్సి ఉంటుందన్నారు.

మరిన్ని వెలుగు న్యూస్ కోసం క్లిక్ చేయండి