గుండెదడ పిల్లలకు నిమ్స్​లో అరుదైన చికిత్స..ఆర్ఎఫ్ఏ విధానంలో చికిత్స చేసి శాశ్వత పరిష్కారం చూపిన డాక్టర్లు

గుండెదడ పిల్లలకు నిమ్స్​లో అరుదైన చికిత్స..ఆర్ఎఫ్ఏ విధానంలో చికిత్స చేసి శాశ్వత పరిష్కారం చూపిన డాక్టర్లు
  • ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఫ్రీ ట్రీట్ మెంట్
  • వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

హైదరాబాద్, వెలుగు: గుండెదడతో బాధపడుతున్న ఇద్దరు పిల్లల జీవితాల్లో నిమ్స్  డాక్టర్లు వెలుగులు నింపారు. ఖమ్మం, హైదరాబాద్  జిల్లాలకు చెందిన ఇద్దరు పిల్లలకు రేడియోఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (ఆర్ఎఫ్ఏ) పద్ధతి ద్వారా చికిత్స చేసి గుండెదడ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. నిమ్స్  కార్డియాలజీ ప్రొఫెసర్  డాక్టర్  ఓరుగంటి సాయి సతీశ్  ఆధ్వర్యంలోని టీమ్ ఈ అరుదైన చికిత్సను మూడు గంటల చొప్పున ఆరు గంటలు శ్రమించి విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ చికిత్సను ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్  ద్వారా ఉచితంగా చేయడం విశేషం.విజయవంతంగా ట్రీట్ మెంట్  చేసిన డాక్టర్లను రాష్ట్ర వైద్యారోగ్య మంత్రి దామోదర రాజనర్సింహా అభినందించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 15 ఏండ్ల బాలుడు చిన్నప్పటి నుంచి గుండెదడ, ఛాతీలో నొప్పి, ఎక్కువగా చెమటలు పట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. ఎన్ని హాస్పిటల్స్  తిరిగినా, మందులు వాడినా నయం కాలేదు. అబ్బాయి పేరెంట్స్ అతడిని నిమ్స్ కు తీసుకొచ్చారు.

పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ అబ్బాయికి గుండె కుడివైపు (డెక్స్‌‌ట్రోకార్డియా)ఉన్నట్లు గుర్తించారు. అవయవాలు తిరిగి ఉండటం(సైటస్ ఇన్‌‌వర్సస్), వోల్ఫ్-పార్కిన్సన్-వైట్ (డబ్ల్యూపీడబ్ల్యూ) సిండ్రోమ్  వల్ల గుండెలో ఎక్స్‌‌ట్రా ఎలక్ట్రికల్ పాత్‌‌వే ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుండెదడ సంభవిస్తుందని నిర్ధారించారు.3డీ మ్యాపింగ్, అనుభవజ్ఞులైన డాక్టర్ల టీమ్  సపోర్ట్‌‌తో విజయవంతంగా చికిత్స చేసి సమస్యను పరిష్కరించారు.

అలాగే, హైదరాబాద్‌‌కు చెందిన 14 ఏండ్ల స్టూడెంట్  గుండెదడ సమస్యతో బాధపడుతున్నాడు. చికిత్స కోసం అనేక హాస్పిటల్స్ తిరిగినా నయం కాలేదు. బాలుడి పేరెంట్స్  అతడిని నిమ్స్ కు తీసుకొచ్చారు. ఎలక్ట్రోఫిజియాలజీ స్టడీ నిర్వహించిన డాక్టర్లు.. అతని గుండె ఎడమవైపు మిట్రల్ వాల్వ్  దగ్గర రేర్ ఎక్టోపిక్ ఫోకస్  (అబ్ నార్మల్ ఎలక్ట్రికల్ సోర్స్) ఉన్నట్లు గుర్తించారు. 3డీ మ్యాపింగ్  సహాయంతో రేర్ ఎక్టోపిక్ ఫోకస్‌‌ను ఆర్ఎఫ్ఏ ద్వారా విజయవంతంగా తొలగించారు. 

ఆ ఇద్దరికీ జీవితంలో  మళ్లీ గుండెదడ రాదు 

ఆర్ఎఫ్ఏ చికిత్స ద్వారా ఇద్దరు పిల్లలకు మళ్లీ జీవితంలో గుండెదడ సమస్యరాదని నిమ్స్  కార్డియాలజీ ప్రొఫెసర్  డాక్టర్  ఓరుగంటి సాయి సతీశ్  తెలిపారు. మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండదని ఆయన పేర్కొన్నారు. ‘‘సాధారణ పిల్లల్లాగే వారూ ఆడుకోవచ్చు. ఇద్దరికీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్  ద్వారా ఫ్రీగా సర్జరీలు చేశాం. ఒక్కో అబ్బాయికి మూడు గంటల చొప్పున ఆరు గంటలు శ్రమించి ట్రీట్ మెంట్  చేశాం. ఇందులో పాల్గొన్న  డాక్టర్లు హేమంత్, సునీత, అజేయ, మౌనిక, అనురాగ్, టెక్నీషియన్స్  ప్రమీల, రామారావు, నర్స్ ఫ్లోరెన్స్ కు అభినందనలు” అని సతీశ్  పేర్కొన్నారు.