గాంధీ పొమ్మంది.. ఊరు వద్దంది

గాంధీ పొమ్మంది.. ఊరు వద్దంది

లక్షణాలతో గాంధీకి పోతే వెనక్కి పంపిన స్టాఫ్
బస్సులో సొంతూరికి.. అక్కడి నుంచి జగిత్యాల హాస్పిటల్ కు
పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ కు వెళ్లాలన్న డాక్టర్లు
ఊళ్లోకి వద్దంటున్న గ్రామస్తులు
దిక్కుతోచని స్థితిలో యువకుడు

జగిత్యాల, వెలుగు: ‘‘నాకు కరోనా లక్షణాలున్నాయి.. చేర్చుకోండి’’అంటూ నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లిన ఓ యువకుడిని అక్కడి సిబ్బంది వెనక్కి పంపారు. తీరా జగిత్యాలలోని సర్కారు దవాఖానకు పోతే పాజిటివ్ అని తేలింది. మిగిలిన వారికి సోకే ప్రమాదం ఉన్నందున హోం ఐసోలేషనుకు వెళ్లాలని అక్కడి డాక్టర్లు సూచించారు. ఇంటికెళదామంటే.. ఊర్లో అడుగుపెట్టొద్దంటూ గ్రామస్తులు రానిస్తలేరు. దీంతో ఏం చేయాలో తెలియక ఆ యువకుడు దిక్కుతోచని స్థితిలో పడ్డాడు. బాధితుని కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం పోరుమల్ల గ్రామానికి చెందిన యువకుడు(23) హైదరాబాద్లో ఎలక్ట్రీషియన్ గా పని చేస్తున్నాడు. కొద్దిరోజులుగా జ్వరం, జలుబుతో బాధపడుతున్నాడు. ఎంతకీ తగ్గకపోవడంతో కరోనాగా భావించి నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళ్లాడు. డైరెక్ట్ గా వెళ్తే చేర్చుకోలేమంటూ అక్కడి సిబ్బంది వెనక్కి పంపించారు. చేసేది లేక ఈ నెల 8న ఆర్టీసీ బస్సులో జగిత్యాల చేరుకున్నాడు. ఫ్రెండ్ బైకుపై సొంతూరు వెళ్లాడు.

జ్వరం తగ్గకపోవడంతో జగిత్యాలలోని జిల్లా దవాఖానకు వెళ్లి ఐసోలేషన్ వింగ్ లో చేరాడు. డాక్టర్లు శాంపిల్స్ తీసి, వరంగల్ పంపించగా బుధవారం పాజిటివ్ అని రిపోర్ట్ వచ్చింది. ఐసోలేషన్ వార్డులోనే ఉంటే మిగతా వారికి వైరస్ సోకుతుందని వెంటనే ఇంటికి వెళ్లాలని అక్కడి డాక్టర్లు ఆర్డరేశారు. సీరియస్ గా ఉంటేనే గాంధీకి రిఫర్ చేయాలని, లేదంటే హోం ఐసోలేషన్ కు పంపాలని ప్రభుత్వ ఆదేశాలున్నాయని చెప్పారు. ఇంటికి ఫోన్ చేస్తే అక్కడికి వచ్చేందుకు ఫ్యామిలీ మెంబర్లు ఒప్పుకోలేదు. డాక్టర్లందరూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో మాట్లాడినా ససేమిరా అన్నారు. ఏం చేయాలో, ఎక్కడికి పోవాలో తెలియక ఆ యువకుడు పరేషాన్‌ అవుతున్నాడు. గాంధీలోనే టెస్టులు చేస్తే పరిస్థితి ఇక్కడి దాకా
వచ్చేది కాదంటున్నాడు. కరోనా సోకిన యువకుడిని వదిలేసిన రెవెన్యూ ఆఫీసర్లు, పోలీసులు.. ఇప్పుడు అతడు ఎవరెవరిని కలిశాడో ఆరా తీస్తున్నారు. అతనితో బస్సులో వచ్చినవారి వివరాలు సేకరించి హోంక్వారంటైన్ చేస్తున్నారు.

For More News..

సీఎం నిర్లక్ష్యానికి డాక్టర్లు బలి

చర్చలు విజయమన్న కాసేపటికే జూడాల సమ్మెబాట

బతుకు భరోసా లేని జర్నలిస్టులు

ఆస్పత్రి వాష్ రూంలో కరోనా పేషంట్ డెడ్ బాడీ