సిటీలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు..

సిటీలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు..
  • పాతకక్షలతో చంపుకుంటున్నరు
  • గ్రేటర్​లో 3 నెలల్లో 14 హత్యలు, 26 హత్యాయత్నాలు
  • పోలీసులకు సవాల్‌‌గా మారిన సీరియల్ మర్డర్స్

హైదరాబాద్‌‌,వెలుగు: గ్రేటర్‌‌‌‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. రౌడీషీటర్ల మధ్య ఆధిపత్యపోరు,పాతకక్షలతో దాడులు పెరిగిపోతున్నాయి. నెల రోజుల వ్యవధిలో  జరిగిన వరుస హత్యలు పోలీసులకు సవాల్​గా మారాయి. ఇందులో సిటీ కమిషనరేట్‌‌ పరిధిలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు హత్యలకు దారితీస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 3 కమిషనరేట్ల పరిధిలో జరిగిన14 హత్యలు,26 హత్యాయత్నం కేసులను పోలీసులు సీరియస్‌‌గా తీసుకున్నారు. గంటల వ్యవధిలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ ప్రయోగించారు. అనుమానితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
లోకల్  గ్యాంగ్స్
పోలీసుల కేస్‌‌ స్టడీస్‌‌ ఆధారంగా ఓల్డ్‌‌సిటీలో రౌడీషీటర్ల మధ్య ఆధిపత్య పోరు పెరిగిపోయింది.  స్ట్రీట్‌‌ ఫైటింగ్స్‌‌ నుంచి  ల్యాండ్‌‌ సెటిల్‌‌మెంట్స్‌‌ వరకు రౌడీషీటర్స్ నేరాలు చేస్తున్నారు. పోలీస్‌‌ స్టేషన్స్‌‌కి వెళ్ళకుండానే గల్లీలో మ్యాటర్ సెటిల్‌‌ చేస్తున్నారు. స్థానికులపై దాడులు చేస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. దీంతో సిటీలోని రౌడీ గ్యాంగ్స్‌‌ మధ్య సెటిల్ మెంట్ల వార్ నడుస్తోంది.  ఈ క్రమంలో ప్రతీకార హత్యలు చేస్తూ రౌడీ గ్యాంగ్స్ రెచ్చిపోతున్నాయి.   రాజేంద్రనగర్ పీఎస్‌‌ లిమిట్స్‌‌లో సోమవారం జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. హసన్‌‌నగర్‌‌‌‌కి చెందిన అబ్దుల్‌‌ రియాజ్‌‌(32)పై గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. బాధితుడు రియాజ్‌‌ మసీదులోకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాడు. రియాజ్‌‌పై దాడికి ల్యాండ్‌‌ సెటిల్ మెంట్ కారణమని రాజేంద్రనగర్ పోలీసులు గుర్తించారు. కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.
ప్రతీకారంతో కత్తులతో దాడి 
ఈ నెల 12న సిగరెట్ కోసం బయటికి వచ్చిన పాత రౌడీషీటర్ జాబేర్(25)ను మైలార్ దేవ్ పల్లి పీఎస్ లిమిట్స్ లో నలుగురు దుండగులు వెంటాడి హత్య చేశారు.  గతేడాది కాలాపత్తర్‌‌ పీఎస్‌‌ లిమిట్స్‌‌ జరిగిన రౌడీషీటర్‌‌ షానూర్‌‌ఖాజీ హత్యకు ప్రతీకారంగా దుండగులు జాబేర్ ను చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ  హత్య కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించారు.   
వైట్​నర్  కోసం డబ్బులు డిమాండ్
ముషీరాబాద్ రాంనగర్‌‌‌‌కి చెందిన ఫయాజ్‌‌(23) గంజాయి,వైట్ నర్‌‌కు బానిసయ్యాడు. ఈ నెల 18న వైట్ నర్ కోసం రూ.2 వేలు ఇవ్వాలని స్థానికుడైన సద్దాం హుస్సేన్ ను  డిమాండ్ చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. దీంతో ఫయాజ్‌‌ తన దగ్గరున్న కత్తితో సద్దాం హుస్సేన్‌‌పై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన సద్దాం హుస్సేన్‌‌ అదే కత్తితో ఫయాజ్‌‌పై దాడి చేశాడు. మరో ఇద్దరు ఫ్రెండ్స్‌‌తో కలిసి ఫయాజ్‌‌ను హత్య చేశాడు. ముషీరాబాద్‌‌ పోలీసులు సద్దాం హుస్సేన్‌‌, మోటాగౌ‌‌స్‌‌ ను అరెస్ట్ చేసి రిమాండ్‌‌కి తరలించారు. మరో కేసులో మంగళ్‌‌హాట్‌‌, ఇందిరానగర్‌‌‌‌లో ఆవారాలు రెచ్చిపోయారు. గత బుధవారం మల్లేపల్లికి చెందిన నరేశ్‌‌(25)పై కత్తులు,రాడ్​తో దాడి చేసి హత్య చేశారు. నరేశ్‌‌ గతంలో ఓ యువకుడిపై దాడి చేశారు. అందుకు ప్రతీకారంగానే ఆ యువకుడి ఫ్రెండ్స్ నరేశ్ ను చంపినట్లు మంగళ్ హాట్ పోలీసులు గుర్తించారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

జవహర్ నగర్ డాన్..ఓల్డ్ సిటీలో హత్య
ఈ నెల 9న ఓల్డ్ సిటీలో జవహర్‌‌‌‌నగర్‌‌  డాన్‌‌గా చలామణి అవుతున్న ఫర్రూను ప్లాన్ ప్రకారం దుండగులు హత్య చేశారు. గతేడాది చంద్రయాణ్‌‌గుట్టలో జరిగిన ఓ మర్డర్‌‌‌‌ కేసులో ఫర్రూ నిందితుడిగా ఉన్నాడు. ఆ కేసులో హత్యకు గురైన రౌడీషీటర్‌‌‌‌ అనుచరులు ఫర్రూను హత్య చేసేందుకు  స్కెచ్ వేశారు. బర్త్‌‌డే పార్టీ పేరుతో ఫర్రూను ట్రాప్ చేశారు. యాకుత్‌‌పురా చోటాపూల్‌‌ వద్ద కళ్లలో కారం చల్లి కత్తులతో దాడి చేసి చంపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు షేక్ సులేమాన్‌‌ సహా  మరో ఐదుగురు నిందితులను సౌత్‌‌జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.  

పోలీసులకు కంప్లయింట్ చేశాడని..
మేడ్చల్‌‌ జిల్లా జగద్గిరిగుట్టలో ఐదు రోజుల క్రితం బైక్ మెకానిక్‌‌ నవాజ్‌‌(20) హత్య జరిగింది. జనవరి 29న నవాజ్‌‌ ఆటోడ్రైవర్‌‌‌‌ ఇమ్రాన్‌‌ ను కిడ్నాప్‌‌ చేసి దాడి చేశాడు.  దీంతో ఇమ్రాన్‌‌ జగద్గిరిగుట్ట పోలీసులకు కంప్లయింట్‌‌ చేశాడు. నవాజ్‌‌పై కక్షపెంచుకున్న ఇమ్రాన్  ఈ నెల 20న తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి అతడిని వెంబడించి కత్తులతో పొడిచి చంపాడు. ఈ కేసులో నిందితులైన ఇమ్రాన్, శ్రీకాంత్, మురళీను జగద్గిరిగుట్ట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు.