
Trump Mobile Services: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాక మునుపు నుంచి ఆయన వ్యాపారవేత్త. ఆయన పిల్లలు కూడా ప్రస్తుతం కొన్ని వ్యాపార సంస్థలను నడిపిస్తున్నారు. అయితే రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ తనకి ఉన్న ఇమేజ్ కొత్త వ్యాపారం ప్రారంభించేందుకు వాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
ALSO READ | AIతో ఉద్యోగాలు పోవటం పక్కా.. "గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ" జియోఫ్రీ హింటన్ కామెంట్స్..! ఎవరు సేఫ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ మొబైల్ ఫోన్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ది ట్రంప్ ఆర్గనైజేషన్’ నిర్వాహకుల్లో ఒకరైన ఎరిక్ ట్రంప్ దీనికి సంబంధించిన ప్రకటనను వెలువరించారు. అమెరికాలో మొబైల్ ఫోన్ సర్వీస్‌కు ట్రంప్ పేరును వాడుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్లు వెల్లడించారు. దీని ద్వారా అమెరికాలో 5జీ సెల్యులార్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలని ట్రంప్ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇందులో భాగంగా బంగారు వర్ణంలో ఉన్న స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ట్రంప్ ఫ్యామిలీ తీసుకొస్తున్న కొత్త టెలికాం సర్వీసెస్ ఇప్పటికే ఉన్న కంపెనీల కంటే మెరుగ్గా ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలో ప్లాన్ 47 కింద నెలకు యూజర్లు కేవలం 47.75 డాలర్లు చెల్లించటం ద్వారా అన్ లిమిటెడ్ డేటా, రోడ్ సైట్ హెల్ప్, టెలీహెల్త్ వంటి సేవలను కూడా అదనంగా పొందవచ్చని ప్రకటించారు. అలాగే బంగారు రంగులో రిలీజ్ కానున్న టి1 ఫోన్లను కేవలం 499 డాలర్లకే విక్రయించనున్నట్లు కూడా ప్రకటించారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిల్ 15 ఆధారంగా పనిచేస్తుంది.
ప్రస్తుతానికి ట్రంప్ మెుబైల్స్ ఎవరు తయారు చేస్తున్నారో బయటకు స్పష్టం కానప్పటికీ వాటిని అమెరికాలోనే ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడైంది. అయితే ఎప్పటి నుంచో ట్రంప్ కి బంగారం అంటే మక్కువ. ఆయన విమానాలు, హోటళ్లు, వాడే ఫర్మిచర్ కూడా బంగారు తాపడం కలిగి ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ చూసుకోనున్నట్లు తెలుస్తోంది.