మలేసియా టూర్లో ట్రంప్ డ్యాన్స్..ఫ్లైట్ దిగగానే స్వాగత బృందంతో కలిసి స్టెప్పులు

మలేసియా టూర్లో  ట్రంప్ డ్యాన్స్..ఫ్లైట్ దిగగానే స్వాగత బృందంతో కలిసి  స్టెప్పులు
  • 8 నెలల్లో 8 యుద్ధాలు ఆపిన. త్వరలో అఫ్గాన్​, పాక్ వార్​ ఆపుత: ట్రంప్​
  • పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ గొప్ప వ్యక్తులు 
  • ఆయన సమక్షంలో థాయ్​లాండ్​ కంబోడియా శాంతి ఒప్పందం
  • రష్యా ఆయిల్ కొనుడు ఇండియా ఆపేస్తుందని వ్యాఖ్య

కౌలాలంపూర్:  పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఘర్షణను త్వరలోనే ముగిసేలా చేస్తానని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆసియాన్ సమిట్​లో పాల్గొనేందుకు ఆదివారం ఆయన కౌలాలంపూర్​కు వచ్చారు. విమానం దిగగానే డ్యాన్స్ చేసి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. ట్రంప్ కు మలేసియా ప్రధాని  అన్వర్ ఇబ్రహీం రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. ఆసియాన్ దేశాల కళాకారులు సంప్రదాయ నృత్యాలు చేస్తూ వెల్ కం చెప్పారు. దీంతో ట్రంప్ కూడా ఉత్సాహంతో వారికి దగ్గరగా వెళ్లి పిడికిళ్లు బిగించి, చేతులు ఊపుతూ సరదాగా స్టెప్పులు వేశారు. ఈ సందర్భంగా ట్రంప్ మీడియాతో మాట్లాడారు. థాయ్, కంబోడియా మధ్య దీర్ఘకాలిక శాంతి నెలకొంటుందని ఆకాంక్షించారు. 

‘‘నా ప్రభుత్వం 8 నెలల్లో ఆపిన 8వ యుద్ధమిది. సగటున నెలకు ఓ యుద్ధాన్ని మేం ఆపాం” అని ఆయన చెప్పారు. ‘‘ఇంకా ఒక యుద్ధం మాత్రమే మిగిలిపోయింది.  పాక్, అఫ్గాన్ మధ్య కూడా ఘర్షణ మొదలైందని విన్నా. దీనిని కూడా త్వరలోనే పరిష్కరిస్తా. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ గొప్ప వ్యక్తులు. ఈ ఘర్షణను త్వరలోనే ఆగేలా చేయగలననడంలో ఎలాంటి సదేహంలేదు” అని అన్నారు. కాగా, ఈ సమిట్ వేదికగా ఆయన సమక్షంలో థాయ్​లాండ్, కంబోడియా దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇందులో భాగంగా, కంబోడియన్ యుద్ధ ఖైదీలను థాయ్​లాండ్ రిలీజ్ చేయనుంది. ఇరుదేశాలూ బార్డర్ నుంచి హెవీ ఆర్టిలరీ గన్స్​ను ఉపసంహరించుకోనున్నాయి. 

డ సిల్వాతో ట్రంప్ భేటీ.. కార్నీకి మాత్రం దూరం 

ఆసియాన్ సమిట్ సందర్భంగా కౌలాలంపూర్​లో బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డ సిల్వాను ఆప్యాయంగా పలకరించిన ట్రంప్.. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన మంచి డీల్స్ కుదుర్చుకుంటామని చెప్పారు. అయితే, ఈ సమిట్​కు వచ్చిన కెనడా ప్రధాని మార్క్ కార్నీని మాత్రం ట్రంప్ పలకరించలేదు. టారిఫ్ వార్ నేపథ్యంలో తనకు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వం టీవీ యాడ్​లు ఇచ్చిన నేపథ్యంలోనే ఆయనపై యూఎస్ ప్రెసిడెంట్ గుర్రుగా ఉన్నారు. కాగా, మలేసియా టూర్ తర్వాత ట్రంప్  జపాన్ వెళ్లనున్నారు.  జపాన్ కొత్త ప్రధాని సనే టకాయిచీతో టోక్యోలో భేటీ కానున్నారు. తర్వాత సౌత్ కొరియాలో జరిగే అపెక్ సమిట్​కు హాజరుకానున్నారు. ఈ నెల 29న చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, ట్రంప్ భేటీ కానున్నారు. ఆఖరి నిమిషంలో నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తోనూ ట్రంప్ భేటీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 

రష్యా ఆయిల్​ను ఇండియా పూర్తిగా ఆపేస్తుంది

రష్యా నుంచి ఇండియా క్రూడ్ ఆయిల్ కొనుగోలు విషయంలో ట్రంప్ మరోసారి అవే కామెంట్లు చేశారు. ఇండియా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను పూర్తిగా ఆపుతోందని చెప్పుకొచ్చారు. శనివారం వాషింగ్టన్ నుంచి కౌలాలంపూర్ కు ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరిన ఆయన ఫ్లైట్​లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనుగోలును చైనా గణనీయంగా తగ్గించుకుంటోంది. ఇండియా కూడా పూర్తిగా రష్యన్ ఆయిల్ కొనుగోళ్లను బంద్ పెట్టనుంది. రష్యాపై మా ఆంక్షల వల్లే ఈ ఫలితాలు వచ్చాయి” అని అన్నారు. సౌత్ కొరియాలో చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్​తో తాను భేటీ కానున్న నేపథ్యంలో ఆయనతో ఈ విషయాన్ని చర్చించే అవకాశం కూడా ఉందన్నారు. కాగా, దేశ ఇంధన అవసరాలు, ప్రయోజనాల మేరకు ఆయిల్ కొనుగోళ్లు చేస్తామని, అమెరికా కోరుకున్నట్టుగా కాదని ఇండియా ఇదివరకే స్పష్టం చేసింది. అయినా, ట్రంప్ మాత్రం పదే పదే ఇదే పాట పాడుతూ వస్తున్నారు.  

ఆసియాన్​లోకి ఈస్ట్ తైమూర్ 

అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏసియన్ నేషన్స్ (ఆసియాన్) కూటమిలోకి ఈస్ట్ తైమూర్ దేశం కూడా ఒక మెంబర్ గా ఆదివారం జాయిన్ అయింది. ఈ సందర్భంగా ఈస్ట్ తైమూర్ ప్రధాని జనానా గుస్మావో మాట్లాడుతూ.. ఇది తమకు చరిత్మాత్మకమైన క్షణమన్నారు. తైమూర్ ప్రజల కలలు నేడు సాకారం అయ్యాయని చెప్పారు.