వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా రూల్స్ పాటించాలి

వాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా రూల్స్ పాటించాలి

కరోనా వ్యాక్సిన్లపై వస్తున్న రూమర్స్ నమ్మవద్దన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. కరోనా వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందన్న వైద్య నిపుణుల మాటలపై భరోసా ఉంచాలన్నారు. దేశవ్యాప్తంగా ఇవాళ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఆయన పర్యవేక్షించారు. టీకా తీసుకున్న కొంతమంది పారిశుద్ధ్య కార్మికులతో ఆయన మాట్లాడారు. కరోనాపై పోరులో ముందున్న వారిని ప్రశంసించారు.

ఢిల్లీలో మొత్తం 81 సెంటర్లలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు టీకా తీసుకున్న ఏ ఒక్కరిలోనూ ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని తెలిపారు సీఎం కేజ్రీవాల్. కరోనా ముప్పు తొలగనున్న ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా కరోనా నిబంధనల్ని పాటించాల్సిందేనని కోరారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరన్నారు కేజ్రీవాల్.