రైతుల్ని నిందించొద్దు.. వాన దేవుడికి యాగం చేయండి

రైతుల్ని నిందించొద్దు.. వాన దేవుడికి యాగం చేయండి

ఢిల్లీ కాలుష్యంపై యూపీ మంత్రి సునీల్ భరాలా కామెంట్స్

దేశ రాజధాని పరిధిలో గాలి విషమయం.. ప్రజల్లో వణుకు

దేశ రాజధానిలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరింది. ఢిల్లీతో పాటు నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో దుమ్ము, ధూళి, పొగ నిండి గాలి విషపూరితంగా మారింది. ఆదివారం ఏకంగా కాలుష్యం తీవ్రత 1400 పాయింట్ల వరకు చేరింది. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో వచ్చేవాళ్లు మాస్కులు కట్టుకుని బయట అడుగుపెడుతున్నారు.

రైతుల వల్లే..: ఢిల్లీ సీఎం

రాజధానిలో ఈ స్థాయిలో కాలుష్యానికి రైతులే కారణమని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఢిల్లీకి ఆనుకుని ఉన్న హర్యానా, యూపీ సహా పంజాబ్ రాష్ట్రాల్లో సరిహద్దు ప్రాంతాల రైతులు పంట ముగిశాక చెత్తను తగలబెట్టడమే ఈ కాలుష్యానికి కారణం. వరి, చెరకు పంటకోశాక మిగిలే గడ్డి, చెత్త భారీగా కాల్చడం వల్ల ఆ పొగ, దుమ్ము ఢిల్లీని కమ్మేస్తోంది. ఈ విషయాన్ని సైంటిస్టులు, నిపుణులు కూడా చెబుతున్నారు. ఎవరిపైనా నిందలు వేసి రాజకీయాలు చేయడం మా ఉద్దేశం కాదు. పొరుగున ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో కూర్చుని దీనిపై మాట్లాడి పరిష్కరించుకుందామన్నదే మా కోరిక’’ అని కేజ్రీవాల్ చెప్పారు.

వాన దేవుడిని ప్రార్థించడమే పరిష్కారం

ఢిల్లీ కాలుష్యానికి రైతులను నిందించడం సరికాదని బీజేపీ నేత, యూపీ మంత్రి సునీల్ భరాలా అన్నారు. ఇవాళ కాదు.. గడ్డిని దహనం చేయడమనేది ఎప్పటి నుంచో సంప్రదాయంగా వస్తోందని చెప్పారాయన. ఇది సహజంగా జరిగేదేనని, వారిని మళ్లీ మళ్లీ బ్లేమ్ చేయడం బాధాకరమని అన్నారు. ఈ కాలుష్యాన్ని తగ్గించడానికి ఒక్కటే మార్గమని, అది వరుణ దేవుడిని పూజించడమేనని చెప్పారు సునీల్. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వాన దేవుడికి యాగం చేస్తే అన్నీ సర్దుకుంటాయన్నారు. వర్షాలు పడి దమ్ము, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు.